
ఇటీవల టాలీవుడ్‌లో (Tollywood) భగవంతుడి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న కమర్షియల్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా శివుని నేపథ్యంలో సినిమాలను రూపొందించడానికి దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. పూర్తి స్థాయి డివోషనల్ సినిమాలే కాకుండా, కథను శివుని తత్త్వానికి అనుసంధానించి సినిమాలు తెరకెక్కడం గమనార్హం. ముఖ్యంగా అఖండ 2, కన్నప్ప, ఓదెల 2, జటాధర, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అఘోర మూవీ వంటి ప్రాజెక్టులు ఈ కోవలో ముందుకు వస్తున్నాయి.
Tollywood
ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది అఖండ 2 (Akhanda 2). బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా, అఖండకు సీక్వెల్‌గా వస్తోంది. ఇందులో బాలయ్య అఘోర పాత్రలో కనిపించనున్నారు. శివుని తత్వాన్ని ప్రధానంగా తీసుకుని రూపొందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది.
ఇదే క్రమంలో మంచు విష్ణు (Manchu Vishnu) నటిస్తున్న కన్నప్ప (Kannappa) కూడా భారీ స్థాయిలో రూపొందుతోంది. కాస్త విభిన్నంగా, పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) శివుడిగా కనిపించనున్నారు. అలాగే, మోహన్ లాల్ (Mohanlal) , ప్రభాస్ (Prabhas), మోహన్ బాబు (Mohan Babu), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఓదెల 2 కూడా శివుని కాన్సెప్ట్‌తో రూపొందిన మరో ఆసక్తికరమైన చిత్రం. ఓదెల రైల్వేస్టేషన్ (Odela Railway Station) చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ఈ మూవీలో తమన్నా అఘోరిగా నటిస్తున్నారు. ఆమె నాగ సాధువుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఇటీవల మహా కుంభమేళాలో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శివుని చుట్టూ కథ తిరగనున్నట్లు సమాచారం.
ఇక సుధీర్ బాబు (Sudheer Babu) నటిస్తున్న జటాధర సినిమా కూడా శివుని నేపథ్యంతో ఉండబోతోంది. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివుని పరమార్థాన్ని ప్రధానంగా చూపించనున్నారు. మరోవైపు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) నటిస్తున్న ఓ సినిమాలో ఆయన అఘోర పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.
వీటితో పాటు, అరవింద్ కృష్ణ, ఆషు రెడ్డి (Ashu Reddy), జ్యోతి పూర్వజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఏ మాస్టర్ పీస్ సినిమా కూడా శివుని కథతోనే సాగనుంది. టాలీవుడ్‌లో ఇలా శివుని పట్ల భక్తి కోణాన్ని కలిపిన కథలు ఎక్కువగా రావడం విశేషం. ప్రేక్షకులు కూడా ఈ తరహా సినిమాలకు మంచి ఆదరణ చూపిస్తుండటంతో, భవిష్యత్తులో మరిన్ని డివోషనల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు వచ్చే అవకాశముంది.