న్యూఢిల్లీ: కథానాయికగా కాస్త డిమాండ్ తగ్గాక పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఏదో వ్యాపారాన్ని ప్రారంభించడం బాలీవుడ్‌లో సాధారణమే. రాజ్‌కుంద్రాను పెళ్లి చేసుకున్న తర్వాత శిల్పాశెట్టి ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫ్రాంచైజీల్లో ఒకరిగా కొనసాగుతూ వ్యాపారం చేసింది. అంతేనా యోగా పాఠాలతో ఓ వీడియో ఆల్బమ్‌ను రూపొందించి మార్కెట్‌లోకి వదిలి కాస్తోకూస్తో సొమ్ము చేసుకుంది. ఇక శ్రీదేవి, మాధురీ, ప్రీతిజింతా ఇలా ఒకప్పటి పేరుమోసిన కథానాయికలు సినిమాల తర్వాత ఏదో ఒకటి చేస్తూ డబ్బు సంపాదించుకునే ప్రయత్నం చేసినవారే. ఇప్పుడు వారి మార్గంలోనే నడిచే ప్రయత్నం చేస్తోంది మరో బాలీవుడ్ నటి పూజా బాత్రా.
అయితే అందరిలాగా టీవీ షోలు, వీడియో ఆల్బమ్‌లు చేయడం వంటివి కాకుండా కాస్త భిన్నంగా ఆలోచిస్తోంది. ఓ పుస్తకాన్ని రాసి, మార్కెట్‌లోకి వదలాలనుకుంటోంది. అది అలాంటి ఇలాంటి పుస్తకం కాదు... తనకు పాకశాస్త్రంలో మంచి ప్రావీణ్యం ఉండడంతో దానిమీదే ఓ పుస్తకాన్ని రాయాలని పూజా డిసైడైంది. ముంబైలో పదహారేళ్ల బాలిక రాసిన ‘వన్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన పూజా తన మనసులోని మాట కూడా బయటపెట్టింది. మీరు కూడా ఏదైనా పుస్తకం రాసే ఆలోచనలో ఉన్నారా? అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘తప్పకుండా రాస్తాను. అయితే అది కాల్పనిక కథలతో కూడిన పుస్తకమైనా కావొచ్చు, రొమాంటిక్ థ్రిల్లర్ కావొచ్చు.
ఈ రెండు కాకపోయినా నాకు వంటలు చేయడం బాగా వచ్చు కాబట్టి ఓ వంటల పుస్తకాన్ని రాయాలనే ఆలోచనలో కూడా ఉన్నాన’ని చెప్పింది. విశ్వవిధాతా, విరాసత్, హసీనా మాన్ జాయేగీ, కహీ ప్యార్ న హోజాయే, నాయక్, కుచ్ ఖట్టీ కుచ్ మీఠీ వంటి చిత్రాల్లో నటించి, 2002లో ఆర్థోపెడిక్ సర్జన్ సోనూ అహ్లూవాలియాను వివాహమాడి అమెరికాకు వెళ్లిపోయింది. 2011లో సోనూ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత బాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్‌ను ప్రారంభించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘లా తో వెగాస్’, ‘స్పిరిట్ ఆఫ్ ముంబై’ రెండు చిత్రాలున్నాయిf