Sharathulu Varthisthai in Telugu: షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

“30 వెడ్స్ 21” వెబ్ సిరీస్ ద్వారా విశేషమైన క్రేజ్ సంపాదించుకొని అప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తూ వచ్చిన చైతన్య ఒక్కసారిగా హీరోగా బోలెడు సినిమాలు సైన్ చేసాడు. వాటిలో ఒకటి “షరతులు వర్తిస్తాయి”. కుమారస్వామి (Kumara Swamy) (అక్షర) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిగువ మధ్యతరగతి కుటుంబ సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..!!

కథ: చిరంజీవి (చైతన్య రావు) (Chaitanya Rao)ఓ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ.. చాలా తక్కువ మంది స్నేహితులు, చిన్నప్పటినుండి ప్రేమిస్తున్న విజయశాంతి (భూమిశెట్టి)(Bhoomika Shetty) , తల్లితో కలిసి ఏ విధంగానూ లోభించకుండా చాలా సంతోషంగా బ్రతుకుతుంటాడు. అనుకోని విధంగా తాను ఇన్నాళ్లు కష్టపడి సంపాదించికున్న సొమ్ము మొత్తం ఓ ప్రయివేట్ స్కీంలో పోగొట్టుకుంటాడు.

అసలు ఆ స్కీం ఏమిటి? అందులో డబ్బు మొత్తం పోగొట్టుకున్న చిరంజీవి & విజయశాంతిఏం చేశారు? వారి డబ్బులు వారికి తిరిగొచ్చాయా? లేదా? వంటి ప్రశ్నలకు సమాధానమే “షరతులు వర్తిస్తాయి” చిత్రం.

నటీనటుల పనితీరు: ఈ తరహా మధ్యతరగతి యువకుడి పాత్రల్లో చైతన్య సరిగ్గా సరిపోతాడు. ఒక సగటు యువకుడిగా అతడి పాత్రలో నిక్కచ్చితత్వం, పొదుపు చేసే గుణం మరియు డబ్బు పోగొట్టుకున్న బాధకు చాలా మంది కనెక్ట్ అవుతారు. నటుడిగా అతడికి మంచి పేరు తెచ్చే పాత్ర ఇది. సాధారణంగా చిన్న సినిమాల్లో హీరోయిన్స్ కి సరైన బరువైన పాత్ర ఉండదు. కానీ.. ఈ చిత్రంలో భూమిశెట్టికి చాలా మంచి పాత్ర లభించింది.

అంతే నేర్పుతో ఆమె పాత్రలో జీవించింది. “పెళ్లిచూపులు”లో చిత్ర తర్వాత ఆస్థాయి పాత్ర విజయశాంతి అని చెప్పాలి. స్నేహితులుగా నటించినవారందరు ఆకట్టుకున్నారు. అయితే.. తల్లి పాత్రలో ఎమోషన్స్ బాగా పండాయి. కాకపొతే.. సంభాషణలు మరీ ఓవర్ డ్రమాటిక్ అయిపోవడంతో కనెక్ట్ అవ్వలేకపోయింది.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాను చాలా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించాలని ప్రీప్రొడక్షన్ నుండే ఫిక్స్ అయిపోనట్లున్నారు మేకర్స్.. మొదటి ఫ్రేమ్ నుండే చాలా కాంప్రమైజ్ అయ్యారని అర్ధమవుతుంది. తక్కువ రోజుల్లో తీయడం కోసం పడిన కష్టం ఎలివేట్ అవ్వకపోగా.. చుట్టేశారు అనే భావన కలుగుతుంది. ముఖ్యంగా.. సినిమాను ఎలివేట్ చేయాల్సిన నేపధ్య సంగీతం సినిమాకి పెద్ద మైనస్ గా నిలిచింది. పాటలు కూడా ఆకట్టుకొనే స్థాయిలో లేవు. సినిమాటోగ్రఫీ, ఆర్ట్, ప్రొడక్షన్ డిజైన్ తదితర టెక్నీకాలిటీస్ గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు.

దర్శకుడు కుమార స్వామి (అక్షర) ఓ మధ్యతరగతి కథను సహజంగా తెరకెక్కించడానికి ప్రయత్నించాడు. అయితే.. సన్నివేశాల రూపకల్పన చాలా సాధారణంగా ఉండడంతో.. ప్రేక్షకులు కథకు కానీ కథనానికి కానీ కనెక్ట్ అవ్వలేరు. అలాగే.. మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా చివరిదాకా ఎంగేజ్ చేసే స్థాయిలో లేదు. అందువల్ల కథకుడిగా, దర్శకుడిగా ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి.

విశ్లేషణ: ఒక సగటు మనిషి కథ అనేది అందరూ తమను తాము చూసుకునేలా ఉంటే సరిపోదు.. ఒక ఎమోషన్ ఉండాలి, ఆ ఎమోషన్ కి సరైన ఎలివేషన్ పడాలి, ఆ ఎలివేషన్ కి సరైన ఎండింగ్ కుదరాలి. అలాంటప్పుడే ఈ తరహా హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ మాత్రమే థియేటర్లలో ప్రేక్షకుల్ని కూర్చోబెట్టగలుగుతాయి. కేవలం సింగిల్ పాయింట్ తో ఆడియన్స్ ను ఆకట్టుకోలేమని దర్శకులు గుర్తించాలి. లేదంటే ఈ తరహా సినిమాలు వచ్చిపోయే విషయం కూడా ఎవరికీ తెలియకుండాపోతుంది.

ఫోకస్ పాయింట్: షరతులు వర్తించాయి.. ప్రేక్షకులు పరారయ్యారు!

రేటింగ్: 1.5/5

Labels:

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.