
యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ తమ్ముడిగా పరిచయమై.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడం కోసం ప్రయత్నిస్తున్న అశ్విన్ బాబు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం “శివం భజే”. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ మంచి ఆసక్తి నెలకొల్పింది. ముఖ్యంగా టీజర్ & ట్రైలర్ చివర్లో శివుడు చూచాయిగా కనిపించడం అనేది ప్రత్యేకతను సంతరించుకుంది. మరి ఈ దేవుడి సెంటిమెంట్ సినిమాకు ఏ స్థాయిలో ఉపయోగపడింది? సినిమా ఎలా ఉంది? అశ్విన్ బాబుకి హీరోగా నిలదుక్కోకునే అవకాశం లభించిందా? అనేది చూద్దాం..!!
కథ: ఓ యాక్సిడెంట్ లో కళ్ళు పోగొట్టుకున్న చందు (అశ్విన్ బాబు)కి మిమ్స్ వైద్యులు ఆపరేషన్ నిర్వహించి కొత్త కళ్ళు పెడతారు. ఆ కళ్ల ఆపరేషన్ జరిగినప్పటినుండి చందుకి ఎవరెవరో కనిపిస్తుంటారు. చందుకి కనిపించిన వాళ్ళందరూ రకరకాల విధాలుగా చంపబడతారు.
అసలు చందుకి ఆపరేషన్ నిర్వహించి ఎవరి కళ్ళు పెట్టారు? ఎందుకని చందుకి ఎవరెవరివో మొహాలు ఎందుకు కనిపిస్తుంటాయి. చందుకి ఆ హత్యలకి సంబంధం ఏమిటి? ఈ కథలో శివుడి పాత్ర ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “శివం భజే” చిత్రం.
నటీనటుల పనితీరు: కొత్త తరహా కథలతో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్న అతికొద్ది మంది కథానాయకుల్లో అశ్విన్ బాబు ఒకడు. మునుపటి చిత్రం “హిడింబ”కానీ ఇప్పుడు “శివం భజే”తో కానీ కొత్త కాన్సెప్త్స్ ను బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. అలాగే.. నటుడిగానూ ప్రతి సినిమాతో పరిపక్వత చూపుతున్నాడు. ఈ చిత్రంలో ఫైట్స్ & ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు.
బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ “జై చిరంజీవ, కిట్టు ఉన్నాడు జాగ్రత్త” తర్వాత తెలుగులో నటించిన మూడో సినిమా ఇది. రెండు వైవిధ్యమైన కోణాలు ఉన్న పాత్రను అర్బాజ్ బాగానే పండించాడు. దిగంగన గ్లామర్ యాడ్ చేసింది కానీ.. సినిమాకి ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. బ్రహ్మాజీ, హైపర్ ఆది అక్కడక్కడ పంచ్ డైలాగులతో నవ్వించారు.
సాంకేతికవర్గం పనితీరు: వికాస్ బాడిస నేపధ్య సంగీతం సినిమాకి మంచి కిక్ ఇచ్చింది. యాక్షన్ బ్లాక్స్ & డివోషనల్ బ్లాక్స్ కి వికాస్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్ గా నిలిచి, సదరు సన్నివేశంలోని ఎమోషన్స్ ను ఎలివేట్ చేసింది. అనిత్ & దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. సీజీ వర్క్ మాత్రం చాలా పేలవంగా ఉంది. దర్శకుడు అప్సర్ “జీనోట్రాన్స్ ప్లాంటేషన్” అనే సరికొత్త విషయానికి కమర్షియల్ & డివోషనల్ హంగులు అద్ది ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశాడు.
ఇంటర్వెల్ బ్యాంగ్ & ప్రీక్లైమాక్స్ వరకూ బాగానే మ్యానేజ్ చేశాడు కానీ.. ఎమోషనల్ & లాజికల్ కనెక్టివిటీ విషయంలో మాత్రం దొరికిపోయాడు. ముఖ్యంగా శివుడ్ని కథలో ఇరికించిన విధానం సెట్ అవ్వలేదు. అలాగే.. చాలా సీరియస్ గా సాగుతున్న కథనంలో ఇరికించిన కామెడీ మైనస్ గా మారింది. సపరేట్ కామెడీ ట్రాక్ లు జనాలు మర్చిపోయి చాలా రోజులవుతుంది. ఈ విషయాన్ని దర్శకుడు గుర్తించకపోవడం మైనస్ అయ్యింది. అయితే.. దర్శకుడిగా కంటే కథకుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు. ఆ కమర్షియల్ & కామెడీ హంగులు ఇరికించకుంటే.. “శివం భజే” మంచి సినిమాగా మిగిలేది.
విశ్లేషణ: రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉంది “శివం భజే”. అయితే.. చాలా సీరియస్ కాన్స్పిరెన్సీ థియరీస్ ను సింపుల్ గా గ్యాంగ్ వార్స్ తరహాలో డీల్ చేయడం మైనస్ గా మారింది. అయితే.. అశ్విన్ బాబు ప్రయత్నం, వికాస్ నేపధ్య సంగీతం & మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకొనేలా తెరకెక్కించిన యాక్షన్ బ్లాక్స్ కోసం ఈ చిత్రం ఒకసారి చూడొచ్చు!
ఫోకస్ పాయింట్: కాలభైరవ కార్యార్ధం కాన్సెప్ట్ శివైక్యం!
రేటింగ్: 2/5