
తెలుగులో వెబ్ సిరీస్ ల ఒరవడి ఇప్పుడిప్పుడే మొదలైంది. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఓటీటీల కోసం మంచి కంటెంట్ తో వెబ్ సిరీస్ లు ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టారు. ఎస్.ఆర్.టీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన తొలి వెబ్ సిరీస్ “వికటకవి” (Vikkatakavi). నరేష్ అగస్త్య టైటిల్ పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ కి ప్రదీప్ మద్దాలి దర్శకుడు. మంచి క్యాస్టింగ్, డీసెంట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం జీ5 యాప్ లో స్ట్రీమ్ అవుతోంది. మరి ఈ 6 ఎపిసోడ్ల సిరీస్ ఎలా ఉందో చూద్దాం..!!
Vikkatakavi Review
కథ: రజాకార్ల నుండి అప్పుడే వేర్పడ్డ హైదరాబాద్ కు చెందిన యువకుడు రామకృష్ణ (నరేష్ అగస్త్య) (Naresh Agastya). పోలీసులు సైతం ఛేదించలేని కేNaresh Agastyaసులను చిటికెలో పూర్తి చేయడంలో సిద్ధహస్తుడు. అతడి తెలివికి అవాక్కైన కాలేజ్ ప్రొఫెసర్ రామకృష్ణను అమరగిరి వెళ్లి, అక్కడి అంతుబట్టని సమస్య తీర్చాల్సిందిగా కోరతాడు. అలా చేస్తే రామకృష్ణ తల్లి చికిత్సకు కావాల్సిన డబ్బులు అమరగిరి సంస్థాన అధిపతి రాజా నరసింహారావు (షీజు అబ్దుల్ రషీద్) ఇస్తాడని ఆశ చూపిస్తాడు.
తల్లి కోసం అమరగిరి వచ్చిన రామకృష్ణకు ఆ ఊరికి వచ్చిన వింతైన సమస్య తెలిసి షాక్ అవుతాడు. ఒక ఊరు మొత్తం అలా ఎలా బాధపడుతుందో అర్థం కాక, కచ్చితంగా ఆ సమస్యను తీర్చాలని నిశ్చయించుకుంటాడు. అసలు అమరగిరి సమస్య ఏమిటి? దాన్ని రామకృష్ణ ఎలా ఛేదించాడు? ఆ క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “వికటకవి”(Vikkatakavi) సిరీస్.
నటీనటుల పనితీరు: తెలుగులో యువనటుల్లో సన్నివేశానికి అవసరమైన మేరకు మాత్రమే చాలా షార్ప్ గా నటించే అతికొద్ది మంది నటుల్లో నరేష్ అగస్త్య ఒకడు. అతడి కళ్లల్లో చురుకుదనం, అతడి హావభావాల్లో మెరుపు రామకృష్ణ పాత్రకు జీవం పోశాయి. నరేష్ బాడీ లాంగ్వేజ్ & మేనరిజమ్స్ చూస్తే నిజంగానే డిటెక్టివ్ అన్నట్లుగా ఉంటాయి. నటుడిగా అతడు పాత్రను పండించడానికి తీసుకునే జాగ్తత్తలు అతడిని మంచి స్థాయికి తీసుకెళతాయి.
రఘు కుంచె రెగ్యులర్ విలన్ రోల్ ప్లే చేసినప్పటికీ.. రఘుపతి పాత్ర తాలూకు క్రూరత్వాన్ని క్యారీ చేసిన విధానం బాగుంది. షీజు, మేఘ ఆకాష్, అమిత్ తివారి తమ రెగ్యులర్ రోల్స్ కి భిన్నంగా కొత్తగా ప్రయత్నించారు. కన్నడ నటుడు తారక్ పొన్నప్పకు మంచి కీలక పాత్ర లభించింది, అతడు ఆ పాత్రకు న్యాయం చేశాడు కూడా. పోలీస్ పాత్రలో రవితేజ నన్నిమాల సిరీస్ లో కీలకపాత్ర పోషించాడని చెప్పాలి. మొదట ఏదో కామెడీ క్యారెక్టర్ అనుకుంటాం కానీ.. సిరీస్ మొత్తం ట్రావెల్ అవుతాడు. చివరికి మన డౌట్స్ అన్నీ క్లియర్ చేసి కొన్నాళ్లపాటు గుర్తుండిపోతాడు.
సాంకేతికవర్గం పనితీరు: అజయ్ అరసాడ నేపథ్య సంగీతం సిరీస్ లో ప్రేక్షకులు లీనమయ్యేలా చేయడంలో కీలకపాత్ర పోషించింది. మూడు డిఫరెంట్ లేయర్స్ ఉన్న ఈ కథకు ఎమోషన్ కు తగ్గ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు అజయ్.
ప్రొడక్షన్ డిజైన్ ను మెచ్చుకొని తీరాలి. 1940 నాటి స్థితిని చక్కగా రీక్రియేట్ చేసారు. ఉన్నవి కొన్ని సన్నివేశాలే అయినా, అందుకు తీసుకున్న జాగ్రత్తలు బాగున్నాయి. షోయబ్ సిద్ధిఖీ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా డీసెంట్ గా ఉంది. ముఖ్యంగా.. నైట్ ఎపిసోడ్స్ ను చాలా సహజంగా తెరకెక్కించాడు.
తేజ దేశరాజ్ ఒక కథలో మల్టిపుల్ సబ్ ప్లాట్స్ తో ముడిపెట్టిన విధానం బాగుంది. ఎక్కువగా సాగదీయకుండా, సింపుల్ గా ఆ చిక్కుముడులను విప్పిన విధానం కూడా బాగుంది. ముఖ్యంగా 5వ ఎపిసోడ్ లో రివీల్ అయ్యే చాలా విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. మదర్ సెంటిమెంట్ నుండి మిస్టరీకి అటు నుంచి యుద్ధం వైపుగా కథను నడిపిన తీరు ప్రశంసనీయం. అలాగే.. ఎక్కడా ఓవర్ బోర్డ్ వెళ్లిపోకుండా.. సగటు ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలోనే ఇవన్నీ వివరించడం బాగుంది. అయితే.. చివరి ఎపిసోడ్ లో రివీల్ అయ్యే బోట్ సీక్రెట్ ఒక్కటే కాస్త పేలవంగా వదిలేశారు అనిపిస్తుంది.
దర్శకుడు ప్రదీప్ మద్దాలి రచయిత తేజ రాసిన కథను అర్థం చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అభినందనీయం. ముఖ్యంగా అనవసరమైన సన్నివేశాలు ఇరికించకుండా, అవసరం లేని సంభాషణలతో కథను సాగదీయకుండా.. ప్రేక్షకులు అప్రమత్తంగా ఉండేలా కథను, కథనాన్ని నడిపించిన తీరు బాగుంది. ఒక దర్శకుడిగా అతడి పనితనం కథలోని ప్రశ్నలకు సమాధానాలు వివరించిన తీరులోనే అర్థమవుతుంది. అలాగే.. సీజన్ 2 కోసమని కథను మధ్యలో వదిలేయకుండా, సక్రమంగా ముగించి.. సెకండ్ సీజన్ లీడ్ కోసం రాసుకున్న సన్నివేశం కూడా బాగుంది. ఓవరాల్ గా దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు ప్రదీప్ మద్దాలి.
విశ్లేషణ: తెలుగులో డిటెక్టివ్ సినిమాలు రావడమే చాలా అరుదు, ఇక సిరీస్ లలో “వికటకవి” (Vikkatakavi) మొదటిది అని చెప్పాలి. అనవసరమైన సాగతీత లేకుండా, ఎక్కడా డ్రామాతో అతి చేయకుండా, సింపుల్ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్ లో ఆడియన్స్ ను ఎంగేజ్ చేసిన వెబ్ సిరీస్ “వికటకవి” (Vikkatakavi). నరేష్ అగస్త్య నటన, తేజ దేశరాజ్ కథ, ప్రదీప్ మద్దాలి దర్శకత్వ ప్రతిభ, అజయ్ అరసాడ నేపథ్య సంగీతం ఈ సిరీస్ ను మస్ట్ వాచ్ గా మార్చాయి. 6 ఎపిసోడ్ల ఈ మిస్టరీ థ్రిల్లర్ ను కుటుంబం మొత్తం కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా బింజ్ వాచ్ చేయొచ్చు.
ఫోకస్ పాయింట్: తెలుగులో వచ్చిన మంచి డిటెక్టివ్ సిరీస్ “వికటకవి”.
రేటింగ్: 3/5