అల్లరి నరేష్ (Allari Naresh) కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ‘సుడిగాడు’ (Sudigaadu) సినిమాను ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు. తెలుగు కమర్షియల్ సినిమాల స్పూఫ్‌లతో ప్రేక్షకులను అలరించి, బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయిన ఈ సినిమా, నరేష్ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లను అందించింది. ఆ తర్వాత నరేష్ చేసిన సినిమాలు ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. ప్రస్తుతం కొత్త జోనర్లను ఎంచుకుంటూ, భిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. లేటెస్ట్ గా డిసెంబర్ 20న విడుదల కానున్న ‘బచ్చలమల్లి’ (Bachhala Malli) సినిమాతో నరేష్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Allari Naresh
ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే మంచి స్పందన అందుకుంది. రియల్ లైఫ్ ప్రేరణతో కూడిన ఈ కథలో, నరేష్ విభిన్నమైన కోపంతో కూడిన క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. యాక్షన్, ఎమోషన్స్‌తో నిండిన ఈ కథతో, నరేష్ తన కెరీర్‌లో మరో మంచి హిట్ అందుకుంటాడనే నమ్మకంతో ఉన్నాడు. ఇదిలా ఉంటే, ఇటీవల ‘బచ్చలమల్లి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ‘సుడిగాడు 2’పై నరేష్ స్పందించారు.
స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా కొనసాగుతోందని, ఈసారి పాన్ ఇండియా స్థాయిలో స్పూఫ్ కథతో సినిమా తెరెకెక్కించనున్నట్లు చెప్పారు. ఇంతకు ముందు తెలుగులో మాత్రమే స్పూఫ్‌లకు పరిమితమైన ‘సుడిగాడు’ కథ, ఈసారి పాన్ ఇండియా రేంజ్‌లో వివిధ భాషల సినిమాల మీద దృష్టి పెట్టబోతోందట. 2026లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నామని నరేష్ వెల్లడించారు. ‘సుడిగాడు 2’ కోసం కొత్త తరహా కథను సిద్ధం చేయడం చాలా టైమ్ తీసుకుంటుందని, మొదటి భాగం కోసం 16 నెలలు స్క్రిప్ట్ వర్క్ చేశామని గుర్తుచేశారు.
ఈసారి మరింత విస్తృతమైన ప్రాసెస్‌లో ఉన్నామని తెలిపారు. సినీ ట్రేడ్ అనలిస్టుల అంచనాల ప్రకారం, ఈ సీక్వెల్ అల్లరి నరేష్ కెరీర్‌లో మరో భారీ విజయాన్ని అందించగలదని భావిస్తున్నారు. స్పూఫ్ జానర్‌లో నరేష్ నటనకు అతను సొంతమైన ప్రత్యేకత ఉంది. ఈ సీక్వెల్‌కు హ్యూమర్, సెటైర్లు, వినోదంతో పాటు మరింత స్ట్రాంగ్ స్టోరీ కాన్ఫ్లిక్ట్‌ను జోడిస్తే, ఇది అన్ని భాషల ఆడియెన్స్‌ను మెప్పించగలదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.