‘పుష్ప: ది రూల్’ (Pushpa 2 The Rule) సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అని, పోలీసుల మాటను పట్టించుకోకుండా ప్రీమియర్ షో ఏర్పాట్లు మార్చేసింది అని వాదనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పండది అంటూ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Pushpa 2 The Rule
తాజాగా ఆ నోటీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం జవాబిచ్చింది. ఈ మేరకు ఆరు పేజీల లేఖను సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులకు పంపినట్లు తెలుస్తోంది. మా థియేటర్‌కి అన్ని అనుమతులు ఉన్నాయి. డిసెంబరు 4న ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2 The Rule) ప్రీమియర్ షో కోసం 80 మంది థియేటర్ సిబ్బంది విధులు నిర్వహించారని తెలిపింది. డిసెంబరు 4, 5 తేదీల్లో థియేటర్ నిర్వహణను మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుందని కూడా ఆ రిప్లైలో సంధ్య థియేటర్ యాజమాన్యం పేర్కొంది.
సినిమాల (Pushpa 2 The Rule) విడుదల సందర్భంగా గతంలోనూ హీరోలు థియేటర్‌కి వచ్చారని, సంధ్య థియేటర్‌లో కార్లు, బైక్‌లకు ప్రత్యేక పార్కింగ్ ఉందని ఆ జవాబులో పేర్కొంది. మరి ఈ జవాబుకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. మరోవైపు కేసు అటు తిరిగి ఇటు తిరిగి మైత్రీ మూవీ మేకర్స్ వైపునకు వచ్చింది. దీంతో వాళ్లు కూడా ఈ విషయంలో జవాబు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్నారు. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ రోజు దానిపై విచారణ జరగనుంది. మరోవైపు ఈ ఘటనలో ఎవరిది తప్పు అనే విషయంలో ఎవరి వాదన వారు బలంగా వినిపిస్తున్నారు. అయితే బాధితురాలు రేవతి కుటుంబానికి ఇప్పటికే నష్టపరిహారం కింద మైత్రీ మూవీ మేకర్స్ డబ్బులు ఇచ్చింది.