తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘దేవర’ (Devara). థియేటర్లలో ఈ సినిమా వచ్చినప్పుడు మంచి టాక్, భారీ వసూళ్ల పోస్టర్లతో తెగ సందడి చేసింది సినిమా. అయితే ఓటీటీలోకి వచ్చాక మొత్తం పరిస్థితి మారిపోయింది. ఏమైందో ఏమో అప్పటివరకు సినిమాను, దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) టేకింగ్‌ను తెగ మెచ్చుకున్న అభిమానులు, ప్రేక్షకులు ఓటీటీలో చూసి విసుక్కున్నారు. ఇలా ఎలా చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చర్చలోకి అనుకుంటున్నారా? ఎందుకంటే సినిమా మళ్లీ విడుదల కాబోతోంది.
Devara
అయితే మన దగ్గర కాదు. తారక్‌కు (Jr NTR) మన దేశం తర్వాత ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్న జపాన్‌లో. వచ్చే ఏడాది మార్చి 28న సినిమాను జపాన్‌లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. దానికి చాలా టైమ్ ఉంది కదా అనుకోవద్దు.. ఇప్పుడు అనుకుంటేనే అప్పటికి సినిమా విడుదలకు పనులు పూర్తవుతాయట. ఆ విషయం వదిలేస్తే.. ఆ మధ్య జపాన్‌లో మన సినిమాలకు అంతో కొంత హైప్ ఉండేది. ఏమైందో ఏమో ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు అని అంటున్నారు.
‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేసినా అవసరమైనంత బజ్ రాలేదు అని అంటున్నారు. ఆ సినిమాను జనవరి 3న అక్కడ రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ అయ్యాక ఏమన్నా మార్పు ఉంటుందేమో చూడాలి. ఈ నేపథ్యంలో ‘దేవర’ సినిమాకు సంబంధించి టీమ్ ఎలాంటి ప్రచారం చేస్తుందో చూడాలి. హీరో, టీమ్ మొత్తంగా వెళ్లి ప్రచారం చేస్తే రియాక్షన్ బాగుంటుంది అని గత సినిమాల అనుభవం ప్రకారం తెలుస్తుంది.
మరి ‘దేవర’ కోసం తారక్ అక్కడికి వెళ్తాడా? అంత ఖాళీ ఉందా అనేదే ప్రశ్న. ‘వార్ 2’ సినిమా పనులు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ సినిమా పనులు స్టార్ట్ అవుతాయి అంటున్నారు. ఈ సమయంలో తారక్ జపాన్ వెళ్లి ‘దేవర’ ప్రచారం చేస్తాడా? అనేది ఆసక్తికరం. అయితే తారక్‌కు అక్కడ పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన పాటలకు రీల్స్, వీడియోలు చేసి సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తుంటారు.