ఒక్కోసారి ఎలాంటి అంచనాలు లేకుండా చూసే సినిమాలు చిన్నపాటి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆ తరహా చిత్రమే “లీగల్లీ వీర్” (Legally Veer). మలికిరెడ్డి వీర్ రెడ్డి నటిస్తూ నిర్మించిన ఈ లీగల్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి కాస్త లేటుగా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మలికిరెడ్డి వీర్ రెడ్డి ఏమేరకు విజయం సాధించారో చూద్దాం..!!
Legally Veer Review
కథ: బాలరాజు అనే సామాన్యుడు ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఆ హత్య అతడు చేయకపోయినా.. అతనే చేసినట్లు అన్నీ కోణాల నుండి నిరూపించడానికి డిఫెన్స్ కి ఛాన్స్ ఉంటుంది. అలాంటి తరుణంలో బాలరాజు తరపున వాదించడానికి కేస్ టేకప్ చేస్తాడు వీర్ (మలికిరెడ్డి వీర్ రెడ్డి). ఊహించినదానికంటే ఎక్కువ కోణాలు ఈ కేసులో ఉన్నాయని, చాలా మంది ఈ కేసు వెనుక ఉన్నారని తెలుసుకుంటాడు వీర్. ఒక లాయర్ గా వీర్ చేసిన సాహసాలేమిటి? బాలరాజును కేసు నుండి బయటపడేయగలిగాడా? వంటి ప్రశ్నలకు సమాధానం “లీగల్లీ వీర్” చిత్రం.
నటీనటుల పనితీరు: బాలరాజు పాత్ర పోషించిన యువకుడు చాలా సహజంగా నటించాడు. బాలరాజు భార్య పోషించిన యువతి కూడా చక్కగా పాత్రలో ఇమిడిపోయింది. సీరియల్ నటి తనూజ పుట్టస్వామి ఈ సినిమాలో కీలకపాత్రలో మెప్పించింది. ఓ సామాన్య ఆధునిక యువతిగా ఆమె పాత్ర & పెర్ఫార్మెన్స్ రిలేటబుల్ గా ఉన్నాయి. ఇక టైటిల్ పాత్రధారి మలికిరెడ్డి వీర్ రెడ్డి నటించడానికి కాస్త ఇబ్బందిపడుతూ.. ప్రేక్షకుల్ని కూడా ఇబ్బందిపెట్టాడు. లాయర్ గా స్క్రీన్ ప్రెజన్స్ బాగున్నప్పటికీ, హావభావాలు పలికించే అనుభవం లేకపోవడంతో చాలా చోట్ల బ్లాంక్ ఫేస్ తో నిలుచుండిపోయాడు.
ఇక కమర్షియల్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కావాలని ఇరికించుకున్న యాక్షన్ బ్లాక్ & డ్యాన్స్ చేయకుండా మ్యానేజ్ చేసిన రొమాంటిక్ సాంగ్ కారణంగా టైమ్ వేస్ట్ తప్ప ఒరిగిందేమీ లేదు. దయానంద్ రెడ్డి తదితరులు పర్వాలేదనిపించుకున్నారు. దివంగత ఢిల్లీ గణేష్ ను ఈ చిత్రంలో తండ్రి పోషించడం విశేషం.
సాంకేతికవర్గం పనితీరు: టెక్నికల్ గా ఆశ్చర్యపరిచిన సినిమా ఇది. సంగీతం చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా.. కెమెరా వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ ఈమధ్యకాలంలో వచ్చిన చాలా చిన్న సినిమాలకంటే బెటర్ గా ఉంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ వర్క్ గురించి చెప్పుకోవాలి.. బడ్జెట్ పరిమితులు పెట్టలేదో ఏమో కానీ మీడియం బడ్జెట్ సినిమాల స్థాయి అవుట్ పుట్ ఇచ్చారు ఛాయాగ్రాహకులు జాక్సన్ జాన్సన్ & అనూష్ గోరక్. ఇక తెరమీద సడన్ గా ప్రేమ్ రక్షిత్ & రోల్ రైడాను చూసి కచ్చితంగా షాక్ అవుతాం. ఆ ర్యాప్ సాంగ్ కూడా బాగుంది. హీరోనే నిర్మాత కావడంతో.. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడలేదు అని స్పష్టమయ్యింది.
దర్శకుడు రవి గోగుల ఎంచుకున్న కథలో నిజాయితీ ఉంది. అయితే.. కొన్ని కమర్షియల్ ఇరుకుబాట్లకు తలొగ్గక తప్పలేదని అర్థమవుతుంది. నిజానికి “చెట్టు కింద ప్లీడర్” తరహాలో తెరకెక్కించాల్సిన సినిమాను “వకీల్ సాబ్” తరహాలో తెరకెక్కించడం అనేది సబ్జెక్ట్ ను కాస్త దెబ్బ తీసింది. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఇరికించకుండా ఉండుంటే కచ్చితంగా మంచి సినిమాగా నిలబడేది. అయినప్పటికీ.. స్క్రీన్ ప్లే విషయంలో తీసుకున్న జాగ్రత్తలకు, కథను మరీ ఎక్కువగా డీవియేట్ చేయకుండా నడిపించినందుకు దర్శకుడు రవి గోగుల ప్రశంసార్హుడు.
విశ్లేషణ: కంటెంట్ & క్వాలిటీ పరంగా తప్పకుండా అలరించే సినిమా “లీగల్లీ వీర్” (Legally Veer). ఆ అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా.. కాస్త బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే కథానాయకుడు ఉండి ఉంటే సినిమా కచ్చితంగా ఎబౌ యావరేజ్ గా నిలిచేది. ఈ కీలకాంశాలు లోపించడంతో ఆకట్టుకోలేక చతికిలపడింది.
ఫోకస్ పాయింట్: క్వాలిటీ బాగుంది కానీ..!
రేటింగ్: 2/5