కొన్ని సినిమాల వెనుక ఉండే కష్టం గురించి చెప్పుకోవడమే కానీ చూడ్డానికి వీలుపడదు. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాల మేకింగ్ వీడియోస్ చూసాక మనకి ఎందుకు అలా ఒక ఫిలిం మేకింగ్ ప్రాసెస్ మరియు ఆ ప్రాసెస్ వెనుక ఉండే డైరెక్టర్ థాట్ ప్రాసెస్ లను ప్రేక్షకులకు పరిచయం చేసే వీడియోలు లేదా డాక్యుమెంటరీలు లేవు అనుకునేవాడ్ని. హాలీవుడ్ సినిమాలు “జాస్” (JAWS) & స్పీల్ బర్గ్ సినిమాల మేకింగ్ వీడియోస్ చూసినప్పుడల్లా మనం ఓ రెండు గంటలపాటు చూసే సినిమా వెనుక ఇంత కష్టం ఉంటుందా అనిపించేది. ఇండియాలోనూ మేకింగ్ వీడియోస్ సంస్కృతి పెరిగినా అది కేవలం ఒక స్పెసిఫిక్ టెక్నికాలిటీ గురించి మాత్రమే ఉండేది.
RRR Behind & Beyond Documentary Review
ఉదాహరణకు షారుక్ ఖాన్ “రా ఒన్” మేకింగ్ వీడియోస్ అన్నీ గ్రాఫిక్స్ ఎలా చేసారు అనే ఉంటాయి. ఎందుకంటే అది షారుక్ ఖాన్ స్వంత సంస్థ రెడ్ చిల్లీస్ కావడంతో అది ఒక బ్రాండ్ ప్రమోషన్ లా అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన మేకింగ్ వీడియోస్ అన్నీ హీరోల లేదా హీరోయిన్ల ఫన్నీ సైడ్ ను చూపించడానికి మాత్రమే దోహదపడ్డాయి. “అత్తారింటిది దారేది” మేకింగ్ వీడియోస్ లో పవన్ కళ్యాణ్, సమంతలు కలిసి చేసే అల్లరికి ఇప్పటికీ యూట్యూబ్ లో లక్షల వ్యూస్ వస్తూనే ఉన్నాయి.
అయితే.. ఒక దర్శకుడి విజన్ ఏమిటి? ఆ విజన్ ను మిగతా బృందానికి అర్థమయ్యేలా చెప్పడానికి ఫాలో అయ్యే పద్ధతి ఏమిటి? అ బృందం దాన్ని ఎలా ఆచరణలో పెడతారు? అనే ఒక ప్రాపర్ ఫిలిం మేకింగ్ ప్రాసెస్ ను అందరికీ అర్థమయ్యేలా చేసిన డాక్యుమెంటరీ “ఆర్ఆర్ఆర్ బిహైండ్ & బియాండ్”. సినిమాలోని కీలక సన్నివేశాలైన ఎన్టీఆర్ ఎంట్రీ షాట్, రామ్ చరణ్ ఎంట్రీ షాట్, ఇద్దరు బ్రిడ్జ్ దగ్గర మొదటిసారి కలిసి సన్నివేశం, ఇంటర్వెల్లో ఎన్టీఆర్ వైల్డ్ యానిమల్స్ తో ట్రక్ నుండి బయటకి దూకే సీన్, నాటు నాటు డ్యాన్స్ సీక్వెన్స్, ఆ తర్వాత వచ్చే ఎన్టీఆర్ & రామ్ చరణ్ మధ్య పోరాట సన్నివేశం, ఆ తర్వాత క్లైమాక్స్ ఫైట్ సీన్. ఇలా ప్రతి ఒక్కదాన్ని బ్రేక్ డౌన్ చేసుకుంటూ వచ్చారు.
ఈ డాక్యుమెంటరీలో కేవలం టెక్నికాలిటీస్ మాత్రమే కవర్ చేయలేదు. ఒక పాత్ర రాసేప్పుడు, దానిలోని ఎమోషన్ ను ఎలా ఎలివేట్ చేస్తారు? ముఖ్యంగా రామ్ & భీమ్ నడుమ టెన్షన్ ను క్రియేట్ చేసిన విధానం, అందుకోసం రచయిత విజయేంద్రప్రసాద్ తీసుకున్న జాగ్రత్తలు, రిఫరెన్సులు. వాటిని రాజమౌళి దృశ్యరూపంగా మలిచి విధానం, ఆ విజువల్స్ ను సెంథిల్ కుమార్ తెరకెక్కించడానికి పడే కష్టం, ఆ తర్వాత సీజీ హెడ్ శ్రీనివాస్ మోహన్ దాన్ని ఎలా ఆన్ స్క్రీన్ విజువలైజ్ చేశారు. దానికి కీరవాణి సంగీతం ఎలా ప్రాణం పోసింది, ఈ తతంగం మొత్తాన్ని శ్రీకర్ ప్రసాద్ తన ఎడిటింగ్ స్కిల్స్ తో ఎలా చిత్రరూపంగా మలిచారు? అనేది అత్యద్భుతంగా ఒక సినిమా చూస్తున్నట్లుగానే చూపించారు. సాధారణంగా డాక్యుమెంటరీలంటే బోర్ కొట్టేస్తాయి.
కానీ.. వాల్స్ & ట్రెండ్స్ టీమ్ మేకింగ్ వీడియోస్ ను జాగ్రత్తగా కలెక్ట్ చేసి ఒక్కో సన్నివేశం వెనుక ఉన్న కష్టాన్ని టెక్నీషియన్స్ తో వివరింపజేసిన విధానం ఈ డాక్యుమెంటరీని మరింత రక్తికట్టించింది. ముఖ్యంగా రైల్వే బ్రిడ్జ్ సీన్ ను ఎన్ని భాగాలుగా విడదీసి షూట్ చేశారు, ఆ మేకింగ్ లో లైటింగ్, గ్రాఫిక్స్ & ప్రొడక్షన్ డిజైన్ అనేవి ఎంత కీలకపాత్ర పోషించాయి అనే విషయాల్ని వెల్లడించే తీరు నవతరం ఫిలిం మేకర్స్ కు ఓ టెక్స్ట్ బుక్ రిఫరెన్స్ లా పనికొస్తుంది అని చెప్పాలి. అలాగే.. “నాటు నాటు” పాటలో ఎన్టీఆర్ & రామ్ చరణ్ ఎందుకని ఒక సింక్ లో డ్యాన్స్ చేయాలి అనేదానికి ఎన్టీఆర్ ఇచ్చిన వివరణ, దాని వెనుక ఉన్న రాజమౌళి ఐడియాలజీ అబ్బురపరుస్తాయి. ఒక పాట కోసం ఇంతగా ఆలోచిస్తారా అనిపిస్తుంది.
అలాగే.. క్యారెక్టరైజేషన్ మరియు వాటి కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ను విజయేంద్రప్రసాద్ 7 రాజమౌళి వివరిస్తుంటే.. ఇంత ఆలోచన ఉంటుందన్నమాట ఒక సన్నివేశం రాసేప్పుడు అనిపిస్తుంది. ఇక నటులుగా రామ్ & భీమ్ పాత్రల కోసం చరణ్ & ఎన్టీఆర్ పడిన కష్టం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ ఎంత కష్టపడి తెరకెక్కించారో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. అలాగే.. ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్ సీన్ లో యానిమల్స్ మూమెంట్స్ కోసం ఏకంగా ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ను రాయించడం అనేది మామూలు విషయం కాదు. దాన్ని సెంథిల్ వెంటనే అర్థం చేసుకుని తెరకెక్కించిన విధానం చూస్తే తెలుస్తుంది.. రాజమౌళితో సింధిల్ ఏ స్థాయిలో సింక్ లో ఉన్నాడో.
ఇక కీరవాణి ఆస్కార్ అందుకోవడం గురించి రాజమౌళి మాట్లాడుతూ “అన్నయ్య ఆస్కార్ స్టేజ్ మీద ది కార్పెంటర్ పాట పాడారు, ఆ తర్వాత ది కార్పెంటర్స్ బృందం “ఆర్ ఆర్ ఆర్” సక్సెస్ కు ఓ పాట పాడి వీడియో ట్వీట్ చేయడం అనేది ఆర్ఆర్ఆర్ సక్సెస్ కు ఒక నిండుతనం తీసుకొచ్చింది” అని చెప్పినప్పుడు అతడి కళ్ళల్లో గర్వం చూస్తే ఒక దర్శకుడిగా కంటే ఒక తమ్ముడిగా తన అన్నయ్య విజయాన్ని రాజమౌళి ఏ స్థాయిలో ఆస్వాదించాడో అర్థమవుతుంది. చివర్లో చిత్రబృందంలోని ప్రతి ఒక్కరూ “ఆర్ఆర్ఆర్” ఫుల్ ఫామ్ ను తమ దృష్టికోణంలో చెప్పిన తీరు భలే ముచ్చటగా ఉంది.
సాంకేతికవర్గం పనితీరు: 20 టెరా బైట్ల ఫుటేజ్ ను ఎడిట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. రఫ్ కట్ చేయడానికే నెలల సమయం పడుతుంది. అటువంటిది ఆ ఫుటేజ్ ను 97 నిమిషాలకు కుదించడం అనేది మామూలు విషయం కాదు. ఈ విషయంలో ఎడిటర్ శిరీష అక్షింతలను ప్రత్యేకంగా ప్రశంసించాలి. అలాగే.. సురేష్ సారంగం టెస్టిమానియల్స్ షూట్ చేసిన విధానం ఎక్కడా సినిమా మూడ్ నుండి ఆడియన్స్ బయటకు రానివ్వకుండా చేసింది. ముఖ్యంగా అందరికీ బ్లాక్ షర్ట్స్ వేసి షూట్ చేయడం వల్ల మనిషి చెబుతున్న విషయం మీదే ప్రతి ఒక్కరి దృష్టి ఉండేలా చూసుకున్నారు. అలాగే.. బీటీఎస్ షూట్ చేసిన శ్రీనివాస్ గడిని కూడా మెచ్చుకోవాలి. ఎన్టీఆర్ & రామ్ చరణ్ ల బాండింగ్ ను అద్భుతంగా క్యాప్చ్యూర్ చేశాడు. కాలభైరవ మ్యూజికల్ అరేంజ్మెంట్స్ ఈ డాక్యుమెంటరీని మరింత ఎంగేజింగ్ గా మార్చాయి.
విశ్లేషణ: సినిమా మేకింగ్ మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక పుస్తకం లాంటి డాక్యుమెంటరీ ఇది. రాజమౌళి ప్రతి ఒక్క సీన్ లో ఫ్రేమ్ లో కనిపిస్తాడు, యాక్షన్ అయినా డ్యాన్స్ అయినా తానే చేసి చూపించేస్తుంటాడు. ఒక ఫిలిం మేకర్ కి సినిమా మీద ఉండాల్సిన ప్యాషన్ & పిచ్చిని ఈ డాక్యుమెంటరీ అర్థమయ్యేలా తెలియజేస్తుంది. సినిమా మేకింగ్ మాత్రమే కాదు సినిమాలు చూడడం మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన డాక్యుమెంటరీ ఇది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ డాక్యుమంటరీ చూశాక మరోసారి “ఆర్ఆర్ఆర్” సినిమా చూడండి, ఇంకా నచ్చేస్తుంది, పాత్రల తాలుకు ఆర్క్ అర్థమవుతుంది, యాక్షన్ బ్లాక్ వెనుక ఉన్న కంపోజిషన్ తెలిసొస్తుంది.
ఫోకస్ పాయింట్: రాజమౌళి కష్టాన్ని, క్రియేటివిటీని ప్రపంచానికి తెలియజెప్పే అత్యద్భుతమైన డాక్యుమెంటరీ!