సినిమా చేస్తామని ఓకే చెప్పి, ఆ తర్వాత డేట్స్ ఇవ్వకుండా, ఇచ్చినా రాకుండా ఉండే హీరోలు, హీరోయిన్లు మన దగ్గర కొంతమంది ఉన్నారు. వారి విషయంలో పెద్ద ఎత్తున కంప్లయింట్‌లు, పంచాయితీలు నడుస్తూ ఉంటాయి. వెనుక జరిగిన విషయాలు ఏంటో తెలియదు కానీ.. తమిళనాడు హీరో శింబు (Simbu) ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో అందరికీ ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏంటి అనే చర్చ మొదలైంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న శింబు కొన్నాళ్ల క్రితం సరైన విజయాలు లేక ఇబ్బందిపడుతూ సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు.
Simbu
ఈ క్రమంలో ‘కరోనా కుమార్’ అనే సినిమాను ఓకే చేశాడు శింబు. అయితే ఆ తర్వాత ఆ సినిమా గురించి పెద్దగా బయటక ఎక్కడా వినిపించడం లేదు. తాజాగా ఆ సినిమా పేరు వినిపిస్తోంది. ఎందుకంటే ఈ విషయంలో శింబుకు కోర్టు షాకిచ్చింది. రూ.కోటి కట్టి తీరాల్సిందే అని తీర్పునిచ్చింది. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ అనే సినిమా నిర్మాణ సంస్థ ‘కరోనా కుమార్’ అనే సినిమాను తెరకెక్కించాలనుకుంది.
ఇందుకుగానూ రూ.5.5 కోట్ల పారితోషికం ఇచ్చేలా నిర్మాణ సంస్థ పారితోషికం ఇవ్వడానికి ఓకే చెప్పింది. ఈ మేరకు నాలుగేళ్ల క్రితం రూ.4.5 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చారు. అయితే శింబు షూటింగ్‌కి రాలేదని నిర్మాణ సంస్థ కోర్టుకెక్కింది. ‘కరోనా కుమార్’ సినిమాను పూర్తి చేయకుండా.. ఇతర సినిమాలు చేయకూడదని నిర్మాణ సంస్థ తరపున హైకోర్టులో కేసు దాఖలు చేసింది.
ఇటీవల ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు.. రూ. కోటి పూచీకత్తు చెల్లించాలని శింబును ఆదేశించింది. అలాగే వేల్స్ ఫిల్మ్స్ – శింబు మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు హైకోర్టు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి కన్నన్‌ను మధ్యవర్తిగా నియమించింది. మధ్యవర్తి ముందు ఇరువర్గాలు కేసును ఉపసంహరించుకున్నాయని శింబు తరఫు న్యాయవాది చెప్పారు. పైన చెప్పినట్లు ఇదే పరిస్థితి ఇలా మధ్యలో సినిమా వదిలేసిన హీరోలందరికీ వస్తే పరిస్థితి ఏంటో?