వెన్నెలకిషోర్ ప్రధాన పాత్రలో రైటర్ మోహన్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ “శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్”. అనన్య నాగళ్ల, రవితేజ మహాదాస్యం కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “పుష్ప” అనంతరం హయ్యస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసే చిత్రమిదే అవుతుంది అంటూ డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి ఇచ్చిన స్టేట్మెంట్ ఈ చిత్రానికి మంచి పబ్లిసిటీ ఇచ్చింది. మరి సినిమా నిజంగా ఆస్థాయిలో ఉందా? లేదా? అనేది చూద్దాం..!!
Srikakulam Sherlock Holmes Review
కథ: బీచ్ లో శవంగా దొరికిన మేరీ అనే అమ్మాయి మృతదేహంతో కథ మొదలవుతుంది. ఆమెను ఎవరు హత్య చేశారు అనే విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి టైమ్ లేకపోవడంతో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ గా పిలవబడే ఓంప్రకాష్ (వెన్నెల కిషోర్)ను సహాయపడమని కోరతారు పోలీసులు.
ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన షెర్లాక్ హోమ్స్ కి ఏడుగురు వ్యక్తుల మీద అనుమానంతో వాళ్ళని విచారిస్తుండగా.. మేరీ హత్య వెనుక కొన్ని ఊహించని, ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.
అసలు ఈ ఏడుగిరిలో మేరీని హత్య చేసింది ఎవరు? అందుకు కారణం ఏమిటి? ఈ కేస్ ను షెర్లాక్ హోమ్స్ ఎలా ఛేదించాడు? అనేది “శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్” కథాంశం.
నటీనటుల పనితీరు: నటీనటులు యాసను ఓన్ చేసుకుంటే పాత్ర ఎంత సహజంగా ఉంటుందో.. బలవంతంగా ఆ యాసలో డైలాగులు చెబుతుంటే అంత ఎబ్బెట్టుగా ఉంటుంది. వెన్నెల కిషోర్ క్యారెక్టరైజేషన్ అందుకు సరైన ఉదాహరణగా నిలుస్తుంది. పాపం కిషోర్ ఎంత ప్రయత్నించినా స్వచ్ఛమైన యాస రాకపోవడంతో.. డబ్బింగ్ థియేటర్లో ఎన్ని తంటాలు పడినా చాలా అసహజంగా కనిపిస్తుంది. ఆ కారణంగా పాత్రలో ఎంత లోతైన భావం ఉన్నా, ఓవరాల్ గా ఆ క్యారెక్టర్ జర్నీకి ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేరు.
అనన్య నాగళ్ల గ్లామర్ తో మాత్రమే కాక నటిగానూ అలరించే ప్రయత్నం చేసింది, ఆమె పాత్రకు ఉన్న మరో షేడ్ బాగున్నప్పటికీ.. ఆమె కళ్ళల్లో ఆ షేడ్ సరిగా ఎలివేట్ అవ్వలేదు. అందువల్ల గట్టిగా పేలాల్సిన ఈ పాత్ర యావరేజ్ ట్విస్టెడ్ రోల్ లా మిగిలిపోయింది.
మరో కీలకపాత్రలో రవితేజ మహాదాస్యం పర్వాలేదనిపించుకున్నాడు. హావభావాల ప్రకటన విషయంలో ఇంకాస్త పరిణితి చెందాల్సి ఉంది.
అనీష్ కురువిల్లతో డబ్బింగ్ చెప్పించకుండా.. డబ్బింగ్ ఆర్టిస్ట్ తో డబ్బింగ్ చెప్పించేప్పటికే ఆ క్యారెక్టర్ డిస్కనెక్ట్ అయిపోయింది.
మరో పాత్రధారికి స్నిగ్ధతో డబ్బింగ్ చెప్పించి.. క్యారెక్టర్ పరంగా ఆమెను ఎలివేట్ చేయాలనుకున్నా.. ఫేస్ కి వాయిస్ కి సింక్ అవ్వకపోవడంతో ఆ పాత్ర కూడా పండలేదు.
ఇక మిగతా పాత్రధారులు తమ పరిధి మేరకు పర్వాలేదనిపించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్ మల్లిఖార్జున్ నారగాని పనితనం ఒక్కటే టెక్నికల్ గా చెప్పుకోదగ్గ అంశం. ఒకే విషయాన్ని, సందర్భాన్ని, సన్నివేశాన్ని వివిధ యాంగిల్స్ లో తెరకెక్కించిన విధానం బాగుంది. సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం సోసోగా ఉంది. పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
దర్శకుడు కమ్ రైటర్ అయిన రైటర్ మోహన్ సినిమా కోసం రాసుకున్న కథలో మేటర్ ఉంది కానీ.. ఆ కథను ఓ కొలిక్కి తీసుకురావడం కోసం అల్లుకున్న కథనంలో పట్టు లేదు. ఒక దర్శకుడిగా కంటే రచయితగానే ఎక్కువ మార్కులు సంపాదించుకుని తన రైటర్ మోహన్ అనే టైటిల్ కి జస్టిఫికేషన్ చేసుకున్నాడు. సినిమాలో అనవసరంగా రాజీవ్ గాంధీ హత్యా ఉదంతాన్ని ఇరికించడం, ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేయడం కోసం రకరకాల పాత్రధారులతో రకరకాల కథనాలు చెప్పించడం అనే ఆలోచనాధోరణి బాగున్నప్పటికీ.. క్లారిటీ లోపించింది. అన్నిటికీ మించి సినిమా ఫార్మాట్ మొత్తం “ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ”ను గుర్తు చేయడం పెద్ద మైనస్ గా నిలుస్తుంది.
ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే.. సినిమా మొత్తం చాలా లిమిటెడ్ బడ్జెట్ లో చుట్టేశారని స్పష్టంగా తెలుస్తుంది.
విశ్లేషణ: చిక్కుముడులను విప్పే విధానమే ఒక థ్రిల్లర్ లో ఆకట్టుకునే అంశం. అలాంటిది అసలు ఆ చిక్కుముడులను వేసిన విధానమే బాగోలేనప్పుడు.. ఆ ముడులు ఎంత ఓపికగా, క్లారిటీతో విప్పినా ఆడియన్స్ ఇంప్రెస్ అవ్వరు. “శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్” విషయంలో జరిగింది ఇదే. రైటర్ మోహన్ ఎండింగ్ మీద పెట్టిన శ్రద్దలో కొంచమైనా ఎస్టాబ్లిష్మెంట్ మీద పెట్టి ఉంటే సినిమా ఓ మోస్తరుగా ఆకట్టుకుని ఉండేది. మరి వంశీ నందిపాటి ఇచ్చిన 891923276 నెంబర్ కి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తాయో చూడాలి.
ఫోకస్ పాయింట్: సివరి 20 నిమిషాల కోసం ఆడియన్స్ థియేటర్లో 120 నిమిషాలు కూసుంటారేటి!
రేటింగ్: 1.5/5