లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఇప్పుడు కోలీవుడ్‌లో మాత్రమే కాకుండా భారతీయ సినిమా ప్రేక్షకులందరి మనసులు గెలుచుకుంటున్న ప్రముఖ దర్శకుడు. ఎల్‌సీయూ (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) క్రియేట్ చేసి, ‘ఖైదీ,’(Kaithi) , ‘విక్రమ్’(Vikram), ‘లియో’(LEO) వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ‘కూలీ’ (Coolie) అనే టైటిల్‌తో రజనీకాంత్‌ను (Rajinikanth) కథానాయకుడిగా పెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం యూనివర్స్‌తో సంబంధం లేకుండా స్టాండ్అలోన్‌గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. అయితే లోకేష్ తదుపరి ప్రాజెక్టులపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.
Lokesh Kanagaraj
అమీర్ ఖాన్‌ను (Aamir Khan) ఒక సూపర్ హీరోగా చూపించేందుకు లోకేష్ ఒక పెద్ద కథను సిద్ధం చేశాడని తాజా సమాచారం. ‘ఇరంబుకై మాయావీ’ అనే టైటిల్‌తో ఉన్న ఈ కథను మొదట తమిళ స్టార్ హీరోతో తీయాలని భావించినా, ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చి, బాలీవుడ్‌కు ఈ కథను అన్వయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అమీర్ ఖాన్‌తో సినిమా అంటే కథ, స్క్రీన్‌ప్లే విషయంలో పర్ఫెక్షన్ అనేది కీలకం. ఈ నేపథ్యంలో, ఈ కథపై మరింత మెరుగులు దిద్దే పనిలో లోకేష్ ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ప్రాజెక్టు హిందీలో భారీ స్థాయిలో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 500 కోట్లతో నిర్మించే అవకాశం ఉన్నట్లు టాక్. ఇక బిజినెస్ కోణంలో ఆ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా ఉంటుందని కూడా టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ నటులను కూడా ఈ ప్రాజెక్టులో భాగం చేయాలని లోకేష్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం హిందీ ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఉంటుందని అంటున్నారు.
ప్రత్యేకంగా, ఈ సినిమాను నిర్మించేందుకు కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ముందుకు వచ్చిందన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సినిమాపై చర్చలు వేగంగా కొనసాగుతున్నాయి. ‘కూలీ’ షూటింగ్ పూర్తయిన వెంటనే కమల్ (Kamal Haasan), అమీర్, లోకేష్ త్రయం మరోసారి భేటీ అయి ఈ ప్రాజెక్టును ఫైనల్ చేయనున్నారని సమాచారం.