తిరుపతి పట్టణంలో మంచు కుటుంబ విభేదాలు మరోసారి తెరమీదికి వచ్చాయి. సినీనటుడు మంచు మనోజ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేయడం తాజా సెన్సేషన్‌గా మారింది. మోహన్ బాబు విశ్వవిద్యాలయం పరిసరాల్లో మనోజ్‌కు అనుమతి లేదని, శాంతి భద్రతల దృష్ట్యా ఎలాంటి వివాదాస్పద చర్యలు తగవని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదే విషయంపై సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి.
Manchu Manoj
మంచు ఫ్యామిలీలో గత కొంతకాలంగా వివాదాలు సద్దుమణగని పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా ఆస్తులు, యూనివర్సిటీ నిర్వహణ పట్ల మనోజ్ అసంతృప్తి వ్యక్తం చేయడం వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఇటీవలి కాలంలో మోహన్ బాబు విశ్వవిద్యాలయం మేనేజ్‌మెంట్‌పై మనోజ్ సీరియస్‌గా ఉన్నారన్న వార్తలు వెలువడ్డాయి. దీని నేపథ్యంలో పోలీసుల నోటీసులు పరిస్థితిని మరింత ఉత్కంఠ భరితంగా మార్చాయి.
తాజాగా, విశ్వవిద్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేయడం గమనార్హం. పోలీసులు మోహన్ బాబు కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. కాలేజీ గేట్లు మూసివేయడం, అనవసరమైన వ్యక్తులను లోపలికి అనుమతించకపోవడం వంటి చర్యలు చేపట్టారు. మరోవైపు, మనోజ్ నోటీసులను తుంగలో తొక్కుతారా లేదా అన్నది ఆసక్తి కలిగిస్తోంది.
ఇప్పటికే ఈ వివాదం కారణంగా మంచు కుటుంబం రెండు వర్గాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు మోహన్ బాబు, ఆయన కుమారుడు విష్ణు, మరోవైపు మనోజ్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా, కుటుంబ సభ్యుల మధ్య చర్చలు, విమర్శలు వెలుగుచూసాయి. ఈ పరిణామాలపై మంచు కుటుంబ అభిమానులు నిరీక్షణతో ఉన్నారు. మరోవైపు, ఈ సంఘటనపై మోహన్ బాబు కుటుంబం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.