
తెలుగు ప్రేక్షకులకు “రంగం” సినిమాతో సుపరిచితుడైన జీవా (Jiiva) అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. తాజాగా ఫాంటసీ థ్రిల్లర్ తో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకొనేందుకు సిద్ధమయ్యాడు. పా విజయ్ (Pa. Vijay) దర్శకత్వంలో తెరకెక్కిన “అగత్యా” చిత్రంలో రాశీఖన్నా (Raashi Khanna) హీరోయిన్ గా కనిపించగా, అర్జున్ సర్జా (Arjun Sarja) కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా తెలుగు టైటిల్ విషయంలో మేకర్స్ కే క్లారిటీ లేకపోవడం, కొన్ని పోస్టర్స్ లో “అగాధియా” అని ఇంకొన్ని పోస్టర్స్ లో “అగత్యా” (Agathiyaa) అనే ప్రచురించడం హాస్యాస్పదం. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం..!!
Agathiyaa Review
కథ: గ్రహాలన్నీ ఒక గాడిలో నిలిచి ఉన్న తరుణంలో పుట్టిన కారణజన్ముడు అగత్య (జీవా). సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్ గా సెటిల్ అవ్వాలనుకుని చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో, ఆ సెట్ ని ఓ స్కేరీ హౌజ్ లా మార్చి డబ్బు చేసుకోవాలనుకుంటాడు.
కట్ చేస్తే.. ఆ ఇంట్లో నిజంగానే దెయ్యాలు ఉంటాయి, అలాగే.. అగత్యాను ఆ దెయ్యాలు హాని చేయకుండా బయటికి పంపాలి అనుకుంటాయి. అసలు ఆ ఇంట్లో ఉన్న దెయ్యాలు ఎవరు? అగత్యాను ఎందుకు బయటికి పంపాలి అనుకుంటాయి? అనేది సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: నటుడిగా జీవా ప్రతిభ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. వీలైనంతవరకు ఈజ్ తో నటించడానికి ప్రయత్నిస్తూ, తనదైన మార్క్ ఎక్స్ ప్రెషన్స్ తో అలరిస్తాడు. అయితే.. ఈ సినిమాలో చాలా సన్నివేశాల్లో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక బ్లాక్ ఫేస్ తో ఉండిపోయాడు. రాశీఖన్నా గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఏదో అలంకారం కోసం హీరో పక్కన తిరుగుతూ, పడిగెడుతూ ఉంటుంది తప్పితే కథ, కథనంతో పనేమీ లేదు ఆవిడకి.
అర్జున్ సర్జా తన పాత్రకు న్యాయం చేశాడు కానీ.. ఆ పాత్రను డైజైన్ చేసిన తీరులో క్లారిటీ లేకపోవడంతో ఆకట్టుకోలేకపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండియన్ ఆడియన్స్ ను పరిచయమైన అమెరికన్ యాక్టర్ ఎడ్వర్డ్ (Edward Sonnenblick) ఈ సినిమాలో విలన్ గా కీలకపాత్ర పోషించాడు. అయితే.. అతడి పాత్ర కూడా సరైన రాత లేక తేలిపోయింది.
మిగతా ఫారిన్ ఆర్టిస్టులు, సౌత్ క్యారెక్టర్ ఆర్టిస్టులు తమకు వీలైనంతవరకు పాత్రల్లో మెప్పించడానికి ప్రయత్నించారు. పాపం రోహిణి పాత్రకు ప్రాస్థెటిక్ మేకప్ కూడా చేసారు కానీ.. సరిగ్గా వినియోగించుకోలేక ఆమె శ్రమ మొత్తం వృధా అయ్యింది.
సాంకేతికవర్గం పనితీరు: యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) పనితనం మీద నమ్మకం కోల్పోయి స్థాయి సంగీతం, నేపథ్య సంగీతం అందిచాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే సీన్ లోని ఎమోషన్ తో అసలు సంబంధమే ఉండదు. ఇక సీజీఐ విషయంలో బృందం అంత కేర్ లెస్ గా, ఆడియన్స్ ను గ్రాంటెడ్ గా తీసుకొని ఏదైనా చూసేస్తారులే అన్నట్లుగా స్టాక్ గ్రాఫిక్స్ తో నింపేసిన తీరు ఫిలిం మేకర్స్ సినిమాని ఎంత సీరియస్ గా తీసుకున్నారు అనేదానికి ఉదాహరణ. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ గ్రాఫిక్స్ ను యానిమేటెడ్ వెర్షన్ లో తెరకెక్కించడమే పెద్ద తప్పు అంటే.. దాన్ని అందులో మార్వెల్ సినిమాల ఫుటేజీలు వాడేయడం అనేది ఇంకా దారుణం.
దర్శకుడు పా విజయ్ ఏదో గొప్ప విషయం చెబుదామనే ప్రయత్నంలో అసలేమీ చెప్పలేక చతికిలపడ్డాడు. సినిమాలో ఇంచుమించుగా ఓ నాలుగు కథలు ఉంటాయి. ఆ నాలుగు కథల్లో రెండు ప్యారలల్ గా రన్ అవుతుంటాయి. అయితే.. ఏ ఒక్క కథ పూర్తిగా ఉండదు. అలాగే.. ఆ కథల సమ్మేళనం, కథనం కూడా సరిగా రాసుకోలేదు. అందువల్ల “అగత్యా” ఓ డైరెక్టర్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది.
విశ్లేషణ: ఫాంటసీ సినిమాలకి కేవలం గ్రాఫిక్స్ సరిపోవు, సరైన కథ, కథనం కూడా ఉండాలి. ముఖ్యంగా ఈ తరహా భారతీయ చరిత్ర ఘనతను చాటి చెప్పే సినిమాల్లో ప్రస్తావించే అంశాలు రియాలిటీకి దగ్గరగా ఉండాలి. అవేమీ లేకుండా కేవలం దేశభక్తి, అమ్మ సెంటిమెంట్ అనే అంశాలను ఆడియన్స్ మీద రుద్ది ముగించేద్దామంటే “అగత్యా”లా అవుతుంది.
ఫోకస్ పాయింట్: అరకొర కథతో అగాధంలో అణిగిపోయిన అగత్య!
రేటింగ్: 1.5/5