
సందీప్ కిషన్ (Sundeep Kishan) 30వ సినిమాగా తెరకెక్కిన చిత్రం “మజాకా” (Mazaka) . త్రినాథరావు నక్కిన (Trinadha Rao) -ప్రసన్న కుమార్ బెజవాడల (Prasanna Kumar) సూపర్ హిట్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రాన్ని రాజేష్ దండా (Rajesh Danda) నిర్మించారు. విడుదలైన టీజర్ & ట్రైలర్ తో మంచి ఆసక్తి నెలకొల్పిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంటుంది అనేది చూద్దాం..!!
Mazaka Review
కథ: చిన్నప్పుడే తల్లిని కోల్పోయి అమ్మ ప్రేమ కోసం ఆరాటపడే కుర్రాడు కృష్ణ (సందీప్ కిషన్) తొలి చూపులోనే మీరా (రీతు వర్మ)ను (Ritu Varma) ప్రేమిస్తాడు, కొడుక్కి పెళ్లి చేయడం కోసం నానా తంటాలు పడుతుండగా.. ఇంటికి ఆడపిల్ల రావాలంటే, ఇంట్లో ఓ ఆడతోడు ఉండాలి అని అందరూ అడుగుతుండడంతో తాను కూడా ఓ అమ్మాయిని ప్రేమించే పనిలో పడతాడు వెంకటరమణ (రావు రమేష్) (Rao Ramesh) . తండ్రికొడుకులిద్దరూ ఒకేసారి ప్రేమలో పడి, ఆ ప్రేమను దక్కించుకోవడం కోసం పడే ఆరాటం, ఈ ఆరాటానికి అడ్డుపడుతున్న వారిని ఎలా ఎదిరించారు? అనేది “మజాకా” కథాంశం.
నటీనటుల పనితీరు: రావు రమేష్ లో ఎంత ఎనర్జీ ఉంది అనేది ఆల్రెడీ “మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం”లో చూసాం. “మజాకా”లో మరోసారి తన సత్తా చాటుకున్నాడు ఆయన. ఎమోషనల్ సీన్స్ లో ఎంత నిజాయితీతో కన్నీరు పెట్టించాడో, కామెడీ సీన్స్ లో అదే స్థాయి ఎనర్జీతో విపరీతంగా నవ్వించాడు. రావు రమేష్ ని టెంప్లేట్ పాత్రలకు పరిమితం చేయకుండా ఈ తరహా రోల్స్ రాస్తే కచ్చితంగా ఆకట్టుకుంటాడు అని ప్రూవ్ చేసాడు.
సందీప్ కిషన్ ఎప్పట్లానే చాలా ఈజ్ తో కృష్ణ క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. సందీప్ కాస్ట్యూమ్స్ విషయంలో తీసుకునే కేర్ & బాడీ లాంగ్వేజ్ తో అలరించే తీరు ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఒక నటుడిగా సందీప్ కిషన్ మార్క్ అనేది ఎమోషనల్ సీన్స్ లో ప్రూవ్ చేసుకున్నాడు.
రీతు వర్మ కామెడీ జోనర్ లో ఇమడడానికి కాస్త ఇబ్బందిపడుతుంది అనిపిస్తుంది. నిజానికి ఆమె క్యారెక్టర్ కి పెద్దగా పెర్ఫార్మ్ చేసే స్కోప్ లేనప్పటికీ, ఉన్న కొద్దిపాటి సీన్స్ లో తేలిపోయిందనే చెప్పాలి. “మన్మథుడు” ఫేమ్ అన్షు (Anshu Ambani) ఈ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వడం, తెరపై ఆమె స్క్రీన్ ప్రెజన్స్ బాగున్నప్పటికీ.. ఆ పాత్రలో మరెవరైనా కాస్త సీనియర్ ఆర్టిస్ట్ ని పెట్టి ఉంటే క్యారెక్టర్ ఇంకా బాగా వర్కవుట్ అయ్యేది. ఎందుకంటే.. సందీప్ కిషన్ కి తల్లి సమానమైన పాత్రలో ఆమె సింక్ అవ్వలేదు.
మురళీ శర్మ క్యారెక్టర్ కొన్ని పాత సినిమాలను గుర్తు చేసినప్పటికీ.. అతడి క్యారెక్టరైజేషన్ అలరించింది. ముఖ్యంగా మురళీశర్మ-శ్రీనివాసరెడ్డి కాంబినేషన్ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. హైపర్ ఆది కామెడీ పంచులు కానీ, కామెడీ ట్రాక్ కానీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఇరికించిన ములక్కాడల ట్రాక్ అనవసరం అనే చెప్పాలి.
సాంకేతికవర్గం పనితీరు: సినిమాలోని ఎమోషన్స్ ను తన నేపథ్య సంగీతంతో ఎలివేట్ చేయడంలో లియోన్ జేమ్స్ (Leon James) ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. చాలా సీన్స్ లో అద్భుతమైన కంటెంట్ ఉంది, సరైన స్కోర్ పడి ఉంటే ఆ సీన్స్ కొన్నాళ్లపాటు గుర్తుండిపోయేవి. అది లేకపోవడంతో ఆ సీన్స్ చాలా పేలవంగా మిగిలిపోయాయి.
నిజార్ షఫీ (Nizar Shafi) సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. అయితే.. పోస్ట్ ప్రొడక్షన్ కి సరైన టైమ్ ఇవ్వలేదు అనే విషయం చాలా చోట్ల స్పష్టమవుతుంది. ముఖ్యంగా కలరింగ్ & డి.ఐకి కనీస స్థాయి టైం ఇవ్వలేదు. అందువల్ల ఆర్టిస్ట్ లుక్స్ నుంచి బ్యాగ్రౌండ్స్ వరకు చాలా చోట్ల డల్ గా ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కి ఇంకాస్త టైమ్ ఇచ్చి ఉంటే బెటర్ క్వాలిటీ అవుట్ పుట్ వచ్చేది.
ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ బాగుంది. ముఖ్యంగా ఓ మధ్య తరగతి కుటుంబం ఇంట్లో వాతావరణాన్ని చాలా నేచురల్ గా రీక్రియేట్ చేశారు. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండొచ్చు. ముఖ్యంగా రావురమేష్-అన్షు కాంబినేషన్ సీన్స్ ఇంకాస్త ట్రిమ్ చెయ్యొచ్చు. రైటర్ ప్రసన్న కుమార్ పంచులు బాగానే పేలాయి కానీ.. పండాల్సిన సన్నివేశాలు సరిగా పండలేదు. రావురమేష్-రీతు వర్మ కాంబినేషన్ లో వచ్చే “పట్టీలు” ఎపిసోడ్ సినిమాలో ఎప్పటికీ గుర్తుండిపోయే సీన్. అంత అద్భుతమైన సీన్లు మరో రెండు మూడు పడి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్ లో సరైన ఎమోషన్ వర్కవుట్ అవ్వలేదు. అలాగే.. రీతూవర్మ & అన్షుల మధ్య కాన్ఫ్లిక్ట్ పాయింట్ చాలా పేలవంగా ఉండడం అనేది సినిమాకి మైనస్ పాయింట్ గా నిలిచింది.
దర్శకుడు త్రినాథరావు నక్కిన సినిమాను వీలైంత చక్కగా హ్యాండిల్ చేశాడు. రావు రమేష్ లోని నటుడ్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో కానీ, సెంటిమెంట్స్ ను ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ, ముఖ్యంగా కామెడీని పండించడంలో కానీ తనదైన మార్క్ చూపించుకున్నాడు. అయితే.. ఓవరాల్ గా సినిమాతో అలరించడంలో మాత్రం తడబడ్డాడు. సరైన కథనం, దాన్ని సపోర్ట్ చేసే సన్నివేశాలు లోపించడంతో సినిమా గాడి తప్పింది.
విశ్లేషణ: కామెడీ సినిమాలకు లాజిక్కులు అవసరం లేదు అనేది ఎంత వాస్తవమో, అదే సినిమాకి ఎమోషన్ సరిగా వర్కవుట్ అవ్వాలి అనేది కూడా అంతే నిజం. “మజాకా” ఈ రెండిటి మధ్య నలిగిపోయింది. అటు లాజిక్కులు లేని మ్యాజిక్ ను క్రియేట్ చేయలేక, ఇటు ఎమోషనల్ గా ఎంటర్టైన్ చేయలేక మధ్యస్థంగా మిగిలిపోయింది. అయితే.. రావు రమేష్ నటన, ప్రసన్న కుమార్ రాసిన కొన్ని సీన్లు, సందీప్ కిషన్ ఈజ్ & త్రినాథరావు నక్కిన మార్క్ టైమ్ పాస్ సీన్స్ కోసం “మజాకా”ను ఓసారి చూడొచ్చు!
ఫోకస్ పాయింట్: మస్తు కాదు కానీ ఓ మోస్తరు మజాకా!
రేటింగ్: 2.5/5