![Director Raghavendra Rao Review on Thandel Movie](https://blr1.digitaloceanspaces.com/assets.telugu/wp-content/uploads/2025/02/Director-Raghavendra-Rao-Review-on-Thandel-Movie.jpg)
ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు (Raghavendra Rao) సినిమాల గురించి రివ్యూలు చాలా తక్కువగా చెబుతుంటారు. ఎంతో నచ్చితేనో, తన స్టైల్‌లో ఉంటేనో తప్ప ఆయన రివ్యూలు ఇవ్వరు. ఇటీవల కాలంలో ఆయన నుండి సినిమాల గురించి అభిప్రాయాలు రావడం చూడలేదు. ఇప్పుడు ‘తండేల్’ (Thandel) సినిమాకు తన రివ్యూ ఇచ్చారు. ఇది దర్శకుడి సినిమా అని సినిమా వెనుక ఉన్న వ్యక్తి గురించి చెప్పుకొచ్చారు. నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందు మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Raghavendra Rao
ఈ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వీక్షించారు. ఈ క్రమంలో సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. సినిమా తనకెంతో నచ్చిందని చెప్పిన ఆయన.. ఎంతోకాలం తర్వాత మనసుని హత్తుకునే మంచి ప్రేమకథా చిత్రాన్ని చూశానని చెప్పారు. చాలా రోజుల తర్వాత ‘తండేల్’ లాంటి అద్భుతమైన ప్రేమకథ చూశాను. నాగ చైతన్య, సాయి పల్లవి పోటీ పడి మరీ నటించారు.
చందూ మొండేటి తీసుకున్న కథ, దాని నేపథ్యం సాహసోపేతమే అని చెప్పాలి. సినిమాలో షాట్ మేకింగ్‌పై దర్శకుడి శ్రద్ధ చాలా బాగుంది. ఈ సినిమాలో మంచి విజయాన్ని అందుకున్న గీతా ఆర్ట్స్‌కు అభినందనలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది దర్శకుడి సినిమా అని ఆ పోస్టులో రాసుకొచ్చారు. ఆ పోస్టుపై నాగచైతన్య తన ఆనందం వ్యక్తం చేశారు. థాంక్యూ సో మచ్ సర్. మీ మాటలు చాలా విలువైనవి. మా సినిమా నచ్చినందుకు సంతోషం అని రిప్లైలో రాసుకొచ్చారు.
‘తండేల్’ గురించి చూస్తే.. శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన జాలర్లు వేటకు వెళ్లగా అనుకోని పరిస్థితుల్లో పాకిస్థాన్ కోస్ట్ గార్డుకు చిక్కుకున్నారు. ఆ తర్వాత రెండేళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఈ ఘటన ఆధారంగా సినిమాను సిద్ధం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజు రూ.21 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది. రెండు రోజులకు రూ.41.20 కోట్ల మార్కు దాటింది.