
“ఆయ్, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం , బచ్చల మల్లి” సినిమాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న అంకిత్ కొయ్య (Ankith Koyya) హీరోగా నటించిన చిత్రం “14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో” (14 Days Girl Friend Intlo) . “గ్యాంగ్ లీడర్” ఫేమ్ శ్రీయ (Shriya Kottam) కొంతం హీరోయిన్ గా పరిచయమైన ఈ చిత్రం ద్వారా శ్రీహర్ష దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. సత్య కోమల్ నిర్మించిన ఈ చిత్రం మార్చ్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 95 నిమిషాల ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. మరి సినిమా ఏమేరకు అలరించింది అనేది చూద్దాం..!!
14 Days Girl Friend Intlo Review
కథ: హర్ష (అంకిత్ కొయ్య) దర్శకుడు అవ్వాలనే ధ్యేయంతో కథలు రాసుకుంటూ ఉంటాడు. ఒకసారి డేటింగ్ యాప్ లో పరిచయమైన అహానా (శ్రియ కొంతం) పిలిచిందని, వాళ్ల పేరెంట్స్ లేనప్పుడు ఆమె ఫ్లాట్ కి వెళతాడు. పెళ్లికి వెళ్లిన అమ్మాయి తల్లిదండ్రులు, అనుకోకుండా వెనక్కి వచ్చేస్తారు. దాంతో.. అహానా ఇంట్లోనే ఇరుక్కుపోతాడు హర్ష.
ఆ తర్వాత ఊహించని విధంగా 14 రోజులపాటు అహానా ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అహానా ఇంట్లో హర్ష ఎందుకు ఇరుక్కోవాల్సి వస్తుంది? ఈ 14 రోజుల్లో ఏం జరిగింది? హర్ష-అహానా నడిచిన డ్రామా ఏంటి? అనేది “14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో” కథాంశం.
నటీనటుల పనితీరు: అంకిత్ కొయ్యలో మంచి పాజిటివ్ ఎనర్జీతోపాటు చిన్నపాటి అమాయకత్వం కూడా ఉంటుంది. అందువల్ల అతడు పోషించిన హర్ష అనే పాత్ర చాలా రిలేటబుల్ గా ఉంటుంది. ముఖ్యంగా ప్రెజంట్ జనరేషన్ లో ఉండే కన్ఫ్యూజన్ & కంగారుని తన నటనతో ఎలివేట్ చేసిన విధానం బాగుంది.
శ్రియ కొంతం స్క్రీన్ కి మంచి ఫ్రెష్ నెస్ యాడ్ చేసింది. ఎప్పుడో “గ్యాంగ్ లీడర్”లో కనిపించిన శ్రియకి, ఈ సినిమాలో కనిపించిన శ్రియకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆమె పాత్రతో అమ్మాయిల మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అనుమానం అనేది పెనుభూతం మీద ఎంత సీరియస్ గా రియాక్ట్ అవుతారు అనే విషయాన్ని బాగా ప్రొజెక్ట్ చేసారు.
ఇక వెన్నెల కిషోర్ (Vennela Kishore) పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర చేసే “మీడియా/ప్రెస్” కామెడీ హిలేరియస్ గా వర్కవుట్ అయ్యింది. అలాగే ఇంద్రజ (Indraja) పాత్రను డీల్ చేసిన విధానం, మోడ్రన్ మదర్ క్యారెక్టరైజేషన్ వల్ల సినిమాకి మంచి వేల్యు యాడ్ అయ్యింది.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు శ్రీహర్ష ఎంచుకున్న పాయింట్ రెగ్యులర్ అయినప్పటికీ.. ఆ పాయింట్ ను సెన్సిబుల్ గా డీల్ చేసిన విధానం, తక్కువ పాత్రలతో డ్రామా పండించిన తీరు బాగుంది. ముఖ్యంగా.. అమ్మాయి కోప్పడి తెగిస్తే ఎలా ఉంటుంది అనే సీక్వెన్స్ ను డీల్ చేసిన విధానం మెచ్యూర్డ్ గా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఆ సీక్వెన్స్ కు బాగా కనెక్ట్ అవుతారు. అలాగే.. యూత్ మైండ్ సెట్ ను డీల్ చేసిన తీరు కూడా బాగుంది. అన్నిటికంటే ముఖ్యంగా సినిమాను అనవసరంగా సాగదీయకుండా 95 నిమిషాల్లో ముగించడం అనేది మేజర్ ప్లస్ పాయింట్.
ప్రొడక్షన్ డిజైన్ విషయంలో కాంప్రమైజ్ అయ్యారు అనేది అర్థమవుతూనే ఉంటుంది. సినిమా సౌండ్ కి సంబంధించి డీసెంట్ బడ్జెట్ పెట్టిన నిర్మాతలు, కలరింగ్, డి.ఐ మీద కూడా స్పెండ్ చేసి ఉంటే బాగుండేది. అప్పుడు ప్రేక్షకులకు కచ్చితంగా ఒక క్వాలిటీ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ వచ్చి ఉండేది. అయితే..ఈమధ్యకాలంలో వచ్చిన చిన్న బడ్జెట్ కాన్సెప్ట్ సినిమాల్లో ఇది బెటర్ ప్రొడక్ట్ అనే చెప్పాలి.
మార్క్ కె.రాబిన్ పాటల కంటే నేపథ్య సంగీతం బాగా కుదిరింది. కె.సోమశేఖర్ సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. బడ్జెట్ పరిమితులకు తలొగ్గినప్పటికీ.. ఎక్కువ సీన్స్ ఫ్లాట్ లోనే ఉన్నప్పటికీ, రిపీటెడ్ ఫ్రేమ్స్ లేకుండా జాగ్రత్తపడ్డాడు. ప్రదీప్ రాయ్ ఎడిటింగ్ పుణ్యమా అని 95 నిమిషాల సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ముందుకు సాగింది.
విశ్లేషణ: ఈమధ్య వచ్చే సినిమాల్లో యువతరం ప్రేమ అంటే ఇష్టపడడం, అర్థం లేని శృంగారంలో తలమునకలవ్వడం, విడిపోవడం అన్నట్లుగానే ప్రాజెక్ట్ చేస్తూ వచ్చారు ఫిలిం మేకర్స్. అయితే.. ఒక అమ్మాయి ప్రేమ, నమ్మకం వంటి విషయాల్లో ఎంత సీరియస్ గా ఉంటుంది, అబ్బాయిల కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి అనేది కాస్త మెచ్యూర్డ్ గా డీల్ చేసిన సినిమా “14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో”. శ్రీహర్ష మన్నె టేకింగ్, అంకిత్ కొయ్య, శ్రియ కొంతం మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్, వెన్నెల కిషోర్ కామెడీ కోసం ఈ సినిమాని హ్యాపీగా చూసేయొచ్చు.
ఫోకస్ పాయింట్: ఎంటర్టైనింగ్ & సెన్సిబుల్!
రేటింగ్: 2.5/5