
ఏఎన్నార్ (ANR) తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా నాగార్జునకి (Nagarjuna) సక్సెస్ అంత ఈజీగా దొరకలేదు. ‘సుడిగుండాలు’ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ‘విక్రమ్’ తో హీరోగా డెబ్యూ ఇచ్చారు. అది ఆడలేదు. ఆ తర్వాత చేసిన ‘కెప్టెన్ నాగార్జున’ ‘అరణ్య కాండ’ కూడా ఫలితాలు కూడా అంతే. ఇలాంటి టైంలో దాసరి ‘మజ్ను’ ఇచ్చి ఆదుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. నాగార్జున కెరీర్లో మొదటి హిట్ సినిమా ఇదే. ఆ తర్వాతి సినిమాలు కూడా అంతంత మాత్రమే ఆడాయి.
Aakhari Poratam
అలాంటి టైంలో అక్కినేని నాగేశ్వరరావు వద్ద ‘ఆఖరి పోరాటం’ (Aakhari Poratam) అనే కథని తీసుకొచ్చారు కె.రాఘవేంద్రరావు (Raghavendra Rao). యండమూరి రచించిన ఓ నవల ఆధారంగా రూపొందిన కథ అది. అయితే ఈ కథ ఏఎన్నార్ కి నచ్చలేదు. ఎందుకంటే ఈ సినిమాలో హీరో కంటే హీరోయిన్ రోల్ కి వెయిటేజీ ఎక్కువగా ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్ సినిమా ఇది అని చెప్పి ‘కొత్త హీరోతో చేస్తే బాగుంటుంది. నాగార్జున ఇప్పుడిప్పుడే హీరోగా నిలబడుతున్నాడు’ అంటూ ఏఎన్నార్ ఆ కథని పక్కన పెట్టారట.
అయితే ఈ విషయం నాగార్జున వరకు వెళ్ళింది. అప్పుడు నాగార్జున ఎలాగు నాన్నగారు వద్దని చెప్పేశారు కదా..! సరే సరదాగా ఒకసారి విందామని నిర్మాత అశ్వినీదత్ (C. Aswani Dutt) గారితో కలిసి రాఘవేంద్ర రావుని కలిశారు. కథ విన్నాక నాగార్జునకి కూడా సేమ్ ఫీలింగ్ వచ్చింది. అయితే హీరో క్యారెక్టర్ కి కొన్ని మార్పులు సూచించి.. అలా ఉంటే చేయడానికి తాను రెడీ అని, నాన్నగారిని కూడా నేను ఒప్పిస్తానని నాగార్జున చెప్పారట. అందుకు రాఘవేంద్రరావు గారు కూడా సరే అని చెప్పి..
నాగార్జున చెప్పిన మార్పులతో స్క్రిప్ట్ ను రెడీ చేశారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. శ్రీదేవి (Sridevi) మెయిన్ రోల్. సుహాసినిని.. పొరపాటున నాగార్జున లవ్ చేయాల్సి వస్తుంది. దీంతో పాటు క్లైమాక్స్ లో శ్రీదేవి పాత్ర చనిపోయే ముందు.. హీరోకి తండ్రికి ఉండే కాన్ఫ్లిక్ట్ పాయింట్ ను కూడా నాగార్జున డిజైన్ చేయించుకున్నారట. అందువల్ల హీరో రోల్ కూడా హైలెట్ అయ్యింది. సినిమా సూపర్ హిట్ అయ్యింది. నేటితో ‘ఆఖరి పోరాటం’ (Aakhari Poratam) రిలీజ్ అయ్యి 37 ఏళ్ళు పూర్తి కావస్తోంది. 1988 మార్చి 12న ‘ఆఖరి పోరాటం’ రిలీజ్ అయ్యింది.