
ఎలాంటి హీరోయిక్ ఎలివేషన్స్ లేకుండా తెలుగులో కోర్ట్ (Court) రూమ్ డ్రామాలు చాలా తక్కువగా వచ్చాయి. ఆ లోటు తీర్చేందుకు నాని నిర్మించిన సినిమా “కోర్ట్” (Court) . శివాజీ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా రామ్ జగదీశ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. “కోర్ట్ నచ్చకపోతే హిట్ 3 చూడకండి” అంటూ నాని ఇచ్చిన స్టేట్మెంట్ చిన్నపాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ఆడియన్స్ హిట్ 3 సినిమా చూడాల్సిన అవసరం ఉందా లేదా అనేది చూద్దాం..!!
Court Review
కథ: ఊర్లో మంచి పేరు, పరపతి, రాజకీయ మరియు అధికార బలం ఉన్న వ్యక్తి మంగపతి (శివాజీ). తన కుటుంబానికి చెందిన జాబిలి (శ్రీదేవి) తక్కువ స్థాయికి చెందిన చందు (హర్ష్ రోషన్) అనే కుర్రాడిని ప్రేమిస్తుందని తెలుసుకొని.. అతడి మీద అబద్ధపు కేసులు, మరీ ముఖ్యంగా పోక్సో కేసు పెట్టి నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టిస్తాడు.
ఆ కేసుల నుంచి చందు ఎలా బయటపడ్డాడు? అందుకు లాయర్ సూర్యతేజ (ప్రియదర్శి) ఎలా తోడ్పడ్డాడు? అనేది “కోర్ట్” (Court) సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: సినిమాలో బోలెడుమంది సీనియర్ ఆర్టిస్టులు, యంగ్ యాక్టర్స్ ఉన్నప్పటికీ.. వాళ్లందరినీ తన స్క్రీన్ ప్రెజన్స్ & టెర్రిఫిక్ డైలాగ్ డెలివరీతో డామినేట్ చేసేశాడు శివాజీ. “బూచమ్మ బూచోడు” తర్వాత దాదాపు 11 ఏళ్ల అనంతరం వెండితెర ఎంట్రీ ఇచ్చి తాను కనిపించే ప్రతి సన్నివేశంలోనూ అత్యద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకులను అలరించడం అనేది మామూలు విషయం కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో శివాజీ రీఎంట్రీ ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆస్థాయిలో మంగపతి పాత్రలో జీవించేశాడు శివాజీ. నిజంగానే మన ఇంట్లో బాబాయ్, మావయ్య లేదా తాతలు గుర్తుకొస్తారు. చాలా రిలేటబుల్ క్యారెక్టర్ ఇది.
మరో సీనియర్ యాక్టర్ సాయికుమార్ కి మంచి పాత్ర లభించింది. సెకండాఫ్ లో ప్రియదర్శి ఇంటికి వెళ్లి సాయికుమార్ చెప్పే మాటలు అర్థవంతంగా ఉంటూనే ఆలోజింపజేస్తాయి. ఆ సన్నివేశాన్ని కంపోజ్ చేసిన విధానం కూడా బాగుంది.
ప్రియదర్శి మంచి బ్యాలెన్స్డ్ ఆర్టిస్ట్. కోపం, ఆశ్చర్యం, హాస్యం వంటి భావాలన్నీ ఒకేసారి పండించగల సత్తా అతడి సొంతం. ఇక అతడికి తెలుగు వాచకం మీద ఉన్న కమాండ్ కారణంగా పదాలు చాలా స్పష్టంగా పలుకుతాడు. ఈ చిత్రంలో పోషించిన లాయర్ పాత్రలో ప్రతి డైలాగ్ స్పష్టంగా పలుకుతూ.. మంచి ఎమోషన్స్ ను పలికిస్తూ నటుడిగా తన స్థాయిని మరింత పెంచుకున్నాడు.
“స్వాగ్” సినిమాతో నటుడిగా ఆశ్చర్యపరిచిన హర్ష్ రోషన్ ఈ సినిమాలో కీలకపాత్రలో నటించిన తీరు రెగ్యులర్ గా ఉన్నప్పటికీ.. సెకండాఫ్ మొత్తం ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం హావభావాలతో రియాక్ట్ అవుతూ పాత్రను పండించిన విధానం బాగుంది.
అలాగే.. శ్రీదేవి సినిమాకి ఒక ఫ్రెష్ నెస్ యాడ్ చేసింది. ఆమె అమాయకంగా కన్నీరు పెట్టుకుంటే ప్రేక్షకుడి మనసులో ఎక్కడో తడి తగులుతుంది.
హర్షవర్ధన్ ఓ కన్నింగ్ లాయర్ గా తన మార్క్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. రోహిణి ఓ సగటు ఆడపిల్ల తల్లిగా అలరించింది.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు రామ్ జగదీశ్ చాలా సెన్సిబుల్ సబ్జెక్టు అయిన “పోక్సో” యాక్ట్ ను మూలకథగా తీసుకొని, ఎక్కడా అసభ్యతకు తావులేకుండా ఆ టాపిక్ ను డిస్కస్ చేసినందుకు కచ్చితంగా ప్రశంసించాలి. అయితే.. కన్వీనియెంట్ గా స్క్రీన్ ప్లే కోర్ట్ ప్రొసీడింగ్స్ రాసుకున్నాడు. నిజానికి హర్షవర్ధన్ వాదించే పాయింట్స్ అన్నీ క్రాస్ ఎగ్జామినేషన్ లో తేలిపోతాయి అని అర్థమవుతూనే ఉంటుంది. అంత సింపుల్ పాయింట్స్ మీద పోక్సో యాక్ట్ కేస్ ను నడిపించడం అనేది ఎందుకో పొసగలేదు.
అలాగే.. శివాజీ పాత్ర ఎంత అద్భుతంగా పేలినప్పటికీ, అతడి పాత్ర తాలూకు వ్యవహారశైలి అలా ఎందుకు ఉంది అనేది క్యారెక్టర్ ఆర్క్ లో ఇంకాస్త ఎక్స్ ప్లోర్ చేసి ఉంటే ఇంకాస్త బెటర్ కనెక్టివిటీ ఉండేది. సాయికుమార్-ప్రియదర్శి మధ్య సన్నివేశాలను రాసుకున్న విధానం ప్రశంసార్హం. “క్వశ్చన్ చేయాలి” అంటూ సాయికుమార్ విపులంగా లాయర్ బాధ్యతను వివరించే విధానం మంచి హై ఇస్తుంది. అయితే.. సినిమా చివర్లో జాబిలి పాత్ర “ఇవాళ నా 18వ బర్త్ డే” అని చెప్పి హగ్ చేసుకోవడం అనేది మాత్రం అప్పటివరకు “పోక్సో” చట్టం, దానిపై ప్రస్తుత తరం ప్రేక్షకులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పుకుంటూ వచ్చిన క్రూషియల్ పాయింట్ ను డైల్యూట్ చేసేసింది.
ఆ ఒక్క డైలాగ్ ను మ్యూట్ చేస్తే బాగుంటుంది. లేదంటే.. 18 ఏళ్లు వచ్చాక ఏదైనా చేయండి అనే తప్పుడు సందేశం ఇచ్చినట్లుగా ఉంటుంది. ఓవరాల్ గా కథకుడిగా కంటే దర్శకుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు రామ్ జగదీష్.
దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ వర్క్, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్, విజయ్ బుల్గానిన్ సంగీతం వంటి టెక్నికల్ అంశాలన్నీ ఒకదాన్ని మరొకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాయి. అందుకే టెక్నికల్ గా ఎక్కడా మైనస్ అనేది కనిపించదు. ఆర్ట్ డిపార్ట్మెంట్ ను కోర్ట్ సెట్ విషయంలో కచ్చితంగా మెచ్చుకోవాలి. అది సెట్ అనే విషయం వాళ్లు చెప్తే తప్ప ఎవరికీ తెలియదు.
విశ్లేషణ: ఎంగేజింగ్ కోర్ట్ రూమ్ డ్రామాలకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే మరియు ఆసక్తికరమైన వాదప్రతివాదనలు చాలా కీలకం. వాదనల్లో లాజిక్కులు, మిస్టరీలు ఎంత బాగా వర్కవుట్ అయితే.. సినిమా అంతలా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. “కోర్ట్” సినిమాలో ఈ రెండూ లోపించాయి. అయినప్పటికీ.. శివాజీ పెర్ఫార్మెన్స్, సాయికుమార్ సెటిల్డ్ డైలాగ్స్, హర్ష్ రోషన్ క్యారెక్టర్ బిహేవియర్, రామ్ జగదీశ్ సెన్సిబిలిటీస్ “కోర్ట్”ను ఓ మంచి సినిమాగా నిలిపాయి.
ఫోకస్ పాయింట్: హ్యాపీగా హిట్3 థియేటర్లలో చూడచ్చు!
రేటింగ్: 3/5