
ఇండియన్ సినిమా గమనాన్ని మార్చడానికి ఒక్కో తరంలో ఒక్కో దర్శకుడు వస్తారు అని చెబుతుంటారు. ఒక్కోసారి ఒకే తరంలో చాలామంది సిద్ధమవుతుంటారు. అలా ఈ తరంలో ఇండియన్ సినిమాను కొత్తగా చూపించే ప్రయత్నం చేసి వరుస విజయాలు అందుకుంటున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel). ‘కేజీయఫ్’ (KGF) సినిమాలతో అందరికీ బాగా దగ్గరైన ఆయన ‘సలార్’తో (Salaar) ఇంకాస్త చేరువయ్యారు. అలాంటాయన రీసెంట్‌గా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. అన్నపూర్ణ ఫిలిం స్కూల్‌లో విద్యార్థుల కోసం అక్కినేని అమల ఇటీవల నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రశాంత్ నీల్ పాల్గొన్నారు.
Prashanth Neel:
ఈ క్రమంలోనే ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే పాత ముచ్చట్లు, తన ఆలోచనలు కూడా పంచుకున్నారు. సినిమా చూడడం తేలికైన పని అని, కానీ, తెరకెక్కించడం కష్టమని ప్రశాంత్ నీల్ చెప్పారు. తన తొలి సినిమా ‘ఉగ్రం’ షూటింగ్ ప్రారంభంకాక ముందు.. ‘ఇప్పటి వరకూ సినిమాలు తెరకెక్కించిన వారంతా బ్యాడ్ డైరెక్టర్స్ అని అనుకునేవాణ్ని అని చెప్పారు. అంతేకాదు ఇండస్ట్రీలో మనమే మార్పు తీసుకురావాలి అని అనుకునేవాడిని.
కానీ, సినిమా మేకింగ్ ఎంత కష్టమో ‘ఉగ్రం’ సినిమా కొంత భాగం చిత్రీకరణ పూర్తయ్యాక అర్థమైందని తెలిపారు. ఆ సినిమా 10 మంది చూసినా చాలు అని అనిపించిందని కూడా చెప్పారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం దర్శకుడి టీమ్‌లో పని చేయాల్సిందే అని నీల్ సూచించారు. అంతేకానీ క్రియేటివిటీ ఆలోచనలో కాదు అని చెప్పారు. తాను చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకున్నానని చెప్పారు.
‘ఉగ్రం’ సినిమా అనుభవం తన తదుపరి పాన్ ఇండియా సినిమా మేకింగ్‌కు బాగా ఉపయోగపడింది అని చెప్పారు. ఆయన సినిమాలు చూస్తే ఆయన ఇంప్రూవ్‌మెంట్ గ్రాఫ్ క్లియర్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు తారక్‌తో (Jr NTR) తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ (ఆల్‌మోస్ట్ ఓకే అయిన టైటిల్) తన గత సినిమాలకు మించి ఉంటుంది అని సినిమా వర్గాలు చెబుతున్నాయి.