
తెలుగమ్మాయి ఆనంది కొంచం గ్యాప్ తీసుకొని నటించిన సినిమా “శివంగి” (Shivangi). చిన్నపాటి ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. ఈ సినిమా టీజర్ & ట్రైలర్ ఓ మేరకు ఆసక్తి రేకెత్తించాయి. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం..!!
Shivangi Review
కథ: సత్యభామ (ఆనంది) పెళ్లైన మొదటి రాత్రే భర్త యాక్సిడెంట్ కారణంగా మంచాన పడినా.. భార్యగా తన బాధ్యతను బాధ్యతతో నిర్వర్తిస్తూ.. భర్తకు ఆపరేషన్ చేయించి మళ్లీ మామూలు స్థితికి తీసుకురావడం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటుంది. అయితే.. ఆఫీస్ లో బాస్ కిరణ్ (జాన్ విజయ్) నుండి లైంగిక వేధింపులు భరిస్తూ, అతడి చేతికి చిక్కకుండా జాగ్రత్తపడుతూ ఉంటుంది.
సరిగ్గా పెళ్లైన మొదటి వార్షికోత్సవాన భర్తకి ఆపరేషన్ కి రంగం సిద్ధం చేసుకున్న సత్యభామకు అనుకోని అవాంతరాలు ఒకదాని తర్వాత ఒకటి తగులుతూ ఉంటాయి. వాటిని సత్యభామ ఎలా ఎదుర్కొంది? అనేది “శివంగి” (Shivangi) కథాంశం.
నటీనటుల పనితీరు: 122 నిమిషాల సినిమాలో దాదాపు 115 నిమిషాల పాటు తెరపై ఆనంది మాత్రమే కనిపిస్తుంది. నటిగా ఆమెకు ఉన్న అనుభవంతో సత్యభామ పాత్రను చక్కగా పండించింది. ముఖ్యంగా పంచ్ డైలాగ్స్ తో కాన్ఫిడెంట్ గా తెరపై కనిపించే ఆనంది పాత్రను ప్రేక్షకులు ఎంజాయ్ చేయడమే కాక ఇన్స్పైర్ అవుతారు కూడా.
వరలక్ష్మి శరత్ కుమార్ షూటింగ్ మహా అయితే రెండు రోజులు చేసి ఉంటారు. చాలా చిన్న పాత్ర, కథాగమనానికి కాస్త ఉపయోగపడింది. అయితే.. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ఇక చివర్లో కనిపించే జాన్ విజయ్ మాత్రం తన విలనిజంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
సాంకేతికవర్గం పనితీరు: ముందుగా డైరెక్టర్ కమ్ సినిమాటోగ్రాఫర్ దేవరాజ్ భరణి కె ధరన్ గురించి మాట్లాడుకోవాలి. ఎంచుకున్న కథ పాతదే అయినా.. ఆ కథను తెరకెక్కించిన విధానంలో కొత్తదనం చూపాడు. ముఖ్యంగా, సినిమా షూట్ మొత్తం ఒక డూప్లెక్స్ అపార్ట్మెంట్ లోనే జరిగినప్పటికీ.. కెమెరా యాంగిల్స్ లో రిపిటీషన్ లేకుండా జాగ్రత్తపడిన విధానం ప్రశంసనీయం. అలాగే.. అమ్మాయిలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలకు ఎప్పుడైనా సరే “నో” చెప్పే అవకాశం ఉంటుంది అని ఎలివేట్ చేసిన విధానం బాగుంది. ఇలా సింగిల్ క్యారెక్టర్ తో సినిమా మొత్తం నడపడం అనేది కూడా అభినందనీయమే.
పాటలు కాస్త బోర్ కొట్టినా.. నేపథ్య సంగీతం మాత్రం సినిమాలో మూడ్ కి సింక్ అయ్యి, హీరోయిన్ యొక్క హీరోయిజాన్ని చక్కగా ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్ డిజైన్, కలరింగ్ టీమ్ వర్క్ కారణంగా మంచి క్వాలిటీ అవుట్ పుట్ వచ్చింది. నిర్మాతలు రాజీపడకుండా ఉండడం కారణంగా ఒక ప్రొపర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కలిగింది.
విశ్లేషణ: ఒక రెగ్యులర్ సినిమాను కొత్త పంథాలో చూపించడం వల్ల ప్రేక్షకులకు ఏ విధంగా ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వొచ్చు అనేదానికి మంచి ఉదాహరణ “శివంగి”. ఆనంది నటన, దేవరాజ్ స్క్రీన్ ప్లే & సినిమాటోగ్రఫీ వర్క్ ప్రేక్షకులని కచ్చితంగా అలరిస్తాయి.
ఫోకస్ పాయింట్: ఆకట్టుకున్న ఆనంది ఏకపాత్రాభినయం!
రేటింగ్: 2.5/5