
అదేదో నాని (Nani) సినిమాలో ‘నువ్వు ఇంతకుమించి దిగజారవు అని అనుకున్న ప్రతిసారి నేను రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నావు’ డైలాగ్ ఒకటి ఉంటుంది మీకు గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో పాత్ర ప్రకారం అలా రాసుకున్నారు కానీ.. నాని సినిమాల ఎంపిక, పాత్రల ఆలోచన చూస్తున్నప్పుడల్లా ఇంకో డైలాగ్ అనిపిస్తుంది. ‘నువ్వు ఇంతకు మించి ప్రయోగం చేయవు అని అనుకున్న ప్రతిసారి మేం రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నావ్’ అని.
Srikanth Odela
‘ప్యారడైజ్’(The Paradise) సినిమా టీజర్ వచ్చినప్పటి నుండి అభిమానులు, ప్రేక్షకులు ఇలానే మాట్లాడుతున్నారు. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్నాడు నాని. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఇటీవల ఈ సినిమాలో నాని లుక్ రిలీజ్ చేశారు. ఈ క్రమంలో నాని గెటప్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఊరమాస్ లుక్‌లో కనిపించాడు. రెండు జడలు వేసుకొని ఉన్న ఆ ఫొటోపై పెద్ద చర్చే జరుగుతోంది.
అయితే ఈ లుక్ గురించి శ్రీకాంత్ ఓదెల ఇటీవల స్పందించారు. నాని లుక్ వెనక ఓ ఎమోషన్ దాగి ఉందని, దాని గురించి ఇప్పుడే చెప్పకూడదు అని అన్నారు. నాని జడల వెనక తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ భావోద్వేగం ఉందని చెప్పారు. తన చిన్నతనంలో అమ్మ ఇలానే జడలు వేసేవారట. ఐదో తరగతి వరకు జుట్టు అల్లేవారట. ఆ ఆలోచన కూడా నాని లుక్ అలా ఉండటానికి ఓ కారణం అని చెప్పారు శ్రీకాంత్ ఓదెల.
‘దసరా’ (Dasara) సినిమాతో నాని – శ్రీకాంత్ ఓదెల కాంబో బ్లాక్‌బస్టర్ బొనాంజా అయిపోయింది. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ సెకండ్ బ్లాక్‌బస్టర్ కోసం ట్రై చేస్తున్నారు. తిరుగుబాటు, నాయకత్వం లాంటి అంశాలు.. తల్లీకొడుకుల అనుబంధం లాంటి ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అని అంటున్నారు. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో రిలీజ్ చేస్తామని టీమ్ చెబుతోంది.