
సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది చూసుకుంటే ఎస్.కె.ఎన్ (Sreenivasa Kumar Naidu) తండ్రి , ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్, సీనియర్ హీరో వేణు (Venu Thottempudi) తండ్రి, అలాగే దర్శకుడు వెట్రి దురై, సింగర్ విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్ పుత్, ‘దంగల్’ నటి అయిన సుహానీ భట్నాగర్, ప్రముఖ రచయిత కమ్ నిర్మాత అయిన వి.మహేశ్, దర్శకుడు చిదుగు రవిగౌడ్, ‘మొగలిరేకులు’ ఫేమ్ పవిత్ర నాథ్,దర్శకుడు కమ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సూర్య కిరణ్(Surya Kiran) , కోలీవుడ్ కమెడియన్ శేషు వంటి వారు మరణించారు.
ఈ షాక్..ల నుండి ఇండస్ట్రీ ఇంకా కోలుకోకుండానే మరో స్టార్ నటుడు గుండెపోటుతో మరణించడం జరిగింది. వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ (Daniel Balaji) గుండెపోటుతో మరణించారు. ఛాతీలో ఆయనకు విపరీతమైన నొప్పి రావడం వల్ల కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను హాస్పిటల్ కి తరలించారు. ఈ క్రమంలో ఆయన చికిత్స పొందుతూనే శుక్రవారం నాడు చివరి శ్వాస విడిచినట్టు తెలుస్తుంది. ఆయన వయసు కేవలం 48 ఏళ్లు మాత్రమే కావడం విషాదకరం.
డేనియల్ బాలాజీ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఆయన పలు సినిమాల్లో నటించడం జరిగింది. ‘వడ చెన్నై’ ‘కాక్క కాక్క’ ‘వేట్టైయాడు విళయాడు’ వంటి తమిళ సినిమాల్లో ఆయన నటించారు. తెలుగులో అయితే వెంకటేష్ నటించిన ‘ఘర్షణ’, నాని నటించిన ‘టక్ జగదీశ్’ వంటి చిత్రాల్లో నటించారు.
కెరీర్ ప్రారంభంలో ఈయన అనేక టీవీ సీరియల్స్ లో నటించడం జరిగింది. ‘చిట్టి’ అనే సీరియల్ ఈయనకి బ్రేక్ ఇచ్చింది. తెలుగు, తమిళ్, మలయాళం.. ఇలా అన్ని భాషల్లోనూ కలుపుకుని ఆయన 40 సినిమాల్లో నటించినట్టు తెలుస్తుంది. బాలాజీ మృతితో కోలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి అని చెప్పాలి.