
ప్రతిష్ఠాత్మక కేన్స్ వేదికపై ఓ భారతీయ సినిమా అరుదైన ఘనత సాధించింది. భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తా 77వ కాన్స్ చలనచిత్రోత్సవాల్లో ‘అన్ సర్టెయిన్ రిగార్డ్’ అనే విభాగంలో ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది. బల్గేరియన్ దర్శకుడు కాన్‌స్టాంటిన్ బొజనోవ్ తెరకెక్కించిన ‘ది షేమ్‌లెస్’ అనే హిందీ సినిమాలో నటనకుగాను అనసూయ ఈ అవార్డు అందుకుంది. అలా ఈ విభాగంలో పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటిగా ఆమె చరిత్ర సృష్టించారు.
కోల్‌కతాకు చెందిన అనసూయ సేన్‌గుప్తా జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంది. 2009లో అంజన్ దత్ తెరకెక్కించిన ‘మ్యాడ్లీ బంగాలీ’తో సహాయనటిగా తెరపైకి అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టాలని 2013లో ముంబయికి వచ్చేసింది. కొన్ని చిన్నచిన్న పాత్రల్లో నటించినా.. చెప్పుకోదగ్గ అవకాశాలేమీ అందుకోలేకపోయింది. దీంతో ప్రొడక్షన్ డిజైనర్‌గా మారింది.
‘సాత్ ఊంఛాకే’, ‘ఫర్గెట్ మి నాట్’, ‘మసాబా మసాబా’ తదితర సినిమాలకు ఆమె పని చేసింది. అనసూయకు నటనతో పాటు రైటింగ్, ఆర్ట్‌లో టాలెంట్ ఉండటాన్ని గమనించిన యశ్‌దీప్ ఆమెను ప్రేమించారు. తర్వాత వాళ్లు పెళ్లి చేసుకున్నారు. దాదాపు సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో ఫేస్‌బుక్ ద్వారా దర్శకుడు అనసూయకు కాన్‌స్టాంటిన్ పరిచయమయ్యారు. 2020లో అలా ‘ది షేమ్‌లెస్’ సినిమా ఆడిషన్‌కి పిలిచారు. ఆమె ఓకే అవ్వడంతో మహారాష్ట్ర, దిల్లీ, నేపాల్‌లో సినిమా చిత్రీకరించారు.
ఇక ‘ది షేమ్‌లెస్’ కథ చూస్తే.. ఇద్దరు వేశ్యల కథ ఇది. దేవదాసీ వ్యవస్థతో ఇబ్బందులు పడ్డ రేణుక దిల్లీలోని ఒక వేశ్యావాటికకు చేరుతుంది. అక్కడ అనుకోని పరిస్థితుల్లో ఒక పోలీసును చంపేస్తుంది. దీంతో అక్కడి నుండి వేరే రాష్ట్రానికి పారిపోయి మరో వేశ్యావాటికకు చేరుతుంది. అక్కడే దేవిక అనే బాలిక పరిచయవుతుంది. రేణుక ఎలా అండగా నిలబడింది అనేదే కథ. రేణుక అనే పాత్రలో అనసూయ నటించింది.