March 26, 202504:43:05 AM

Jithender Reddy Review in Telugu: జితేందర్ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!

“ఎవ్వరికీ చెప్పొద్దు” అనంతరం అయిదేళ్ల విరామం తర్వాత రాకేశ్ వర్రె, “మజ్ను” అనంతరం ఎనిమిదేళ్ల తర్వాత విరించి వర్మల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం “జితేందర్ రెడ్డి”. జగిత్యాలకు చెందిన యువనేత జితేందర్ రెడ్డి జీవితం ఆధారంగా ఆయన తమ్ముడు రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నిజానికి మే నెలలోనే విడుదలకావాల్సి ఉండగా.. ఎలక్షన్ కోడ్ కారణంగా సెన్సార్ క్లియర్ అవ్వక ఆగి.. ఇప్పటికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో రాకేష్ మాట్లాడుతూ “సెలబ్రిటీస్ పిలిచినా సినిమాను ప్రమోట్ చేయడానికి రారండీ” అంటూ వైర్ అయిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. మరి అంత కష్టపడి వీళ్ళందరూ చేసిన ఈ ప్రయత్నం ఎలా ఉందో చూద్దాం..!!

Jithender Reddy Review in Telugu:

కథ: చిన్నప్పటినుండి ఏబీవీపీ భావజాలంతో పెరిగిన కుర్రాడు జితేందర్ రెడ్డి (రాకేష్ వర్రే). నక్సలైట్లు చేసే అన్యాయాలను ఎదుర్కోవాలి అనుకుంటాడు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న జితేందర్ రెడ్డి అధికార పార్టీకి మాత్రమే కాక అన్నలకు కూడా ఎదురెళతాడు. ఏ ఈ క్రమంలో అతడు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? జితేందర్ రెడ్డి జీవితం ఎలా ముగిసింది? అందుకు మూలకారకులు ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానమే “జితేందర్ రెడ్డి” చిత్రం.

నటీనటుల పనితీరు: జితేందర్ రెడ్డి అనే నిజజీవిత పాత్రలో ఒదిగిపోయాడు రాకేష్. ఒక నటుడిగా అతడ్ని ఒక మెట్టు ఎక్కించే చిత్రమిది. ఓ విద్యార్థి నాయకుడిగా అతడి బాడీ లాంగ్వేజ్, ఒక లీడర్ గా అతడి వ్యవహార శైలిలో వచ్చే మార్పుల విషయంలో చాలా జాగ్రత్త కనిపించింది. ఒక నటుడిగా రాకేష్ కి మంచి గుర్తింపు తీసుకొస్తుంది ఈ చిత్రం.

సుబ్బరాజుకి మంచి పాత్ర పడింది. ఒక అర్థవంతమైన పాత్రలో చక్కని నటనతో ఆకట్టుకున్నాడు సుబ్బరాజు. రవి ప్రకాష్ కు కూడా చాన్నాళ్ల తర్వాత సినిమా మొత్తం ట్రావెల్ చేసే క్యారెక్టర్ దొరికింది. ముఖ్యంగా అతడి దృష్టికోణంలో కథను నడిపించడం అనేది హర్షణీయం. రియా సుమన్, వైశాలి, బిందు చంద్రమౌళి తదితరులు పర్వాలేదనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: గోపీసుందర్ పాటలు, నేపథ్య సంగీతం ఈ సినిమాకి మెయిన్ హైలైట్స్. ముఖ్యంగా మాస్ సీన్స్ ను ఎలివేట్ చేసిన విధానం బాగుంది. జ్ఞానశేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా సహజంగా ఉంది. 1980 నాటి పరిస్థితులను చక్కగా చూపించాడు. ముఖ్యంగా ఫైట్స్ & ఛేజింగ్ సీక్వెన్స్ లను చూపించిన వైనం బాగుంది. దర్శకులు తమ పంథా నుండి బయటికి వచ్చి సినిమాలు తీస్తే ఎలా ఉంటుందో ఇటీవలే వెంకీ అట్లూరి “లక్కీ భాస్కర్”తో చూపించాడు.

విరించి వర్మ కూడా తన కంఫర్ట్ జోన్ అయిన లవ్ స్టోరీస్ నుంచి బయటకి వచ్చి ఇలా ఓ బయోపిక్ ను లాజికల్ & సెన్సిబుల్ గా తెరకెక్కించడం అనేది మెచ్చుకోవాల్సిన విషయం. విరించి వర్మ సెన్సిబిలిటీస్ కారణంగా కథ ఎక్కడా అతిగా అనిపించదు. కాకపోతే.. స్క్రీన్ ప్లే ఇంకాస్త బాగుంటే గనుక సినిమాకి మంచి ప్లస్ అయ్యేది. అది లోపించడంతో సినిమా సదరు చరిత్ర మరియు వ్యక్తి తెలిసినవాళ్ళకి తప్ప ఎవరికీ కనెక్ట్ అవ్వలేకపోయింది.

మేకింగ్ పరంగా నిజాయితీ కనిపించింది కానీ.. ఓవరాల్ గా ఆడియన్స్ ను ఎంగేజ్ చేయలేకపోయిందనే చెప్పాలి. సో, దర్శకుడిగా ఆకట్టుకున్న విరించి వర్మ, కథకుడిగా మాత్రం అలరించలేకపోయాడు. ప్రొడక్షన్ ఇంకాస్త బెటర్ గా ఉంటే అవుట్ పుట్ కూడా బాగుండేది.

విశ్లేషణ: ఒక్కోసారి నిజాయితీ ఉన్నా.. ఆ నిజాయితీని ప్రేక్షకులు ఆస్వాదించే స్థాయిలో కథను నడపడం అనేది చాలా ముఖ్యం. అలా లేనిచో.. ప్రేక్షకులు నిజాయితీని పట్టించుకోరు. ఎందుకంటే వందలరూపాయలు ఖర్చు చేసి థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సింది డ్రామాతో. పాత్రతో పాటు పాత్ర చుట్టూ జరిగే డ్రామా అనేది ఆడియన్స్ ను అలరించే అంశం. ఈ విషయంలో మేకర్స్ జాగ్రత్త వహించకపోవడంతో “జితేందర్ రెడ్డి” ఓ మంచి ప్రయత్నంగా మాత్రమే మిగిలిపోయింది.

ఫోకస్ పాయింట్: నిజాయితీ ఉన్నా.. సరైన డ్రామా కొరవడిన వీరగాథ!

రేటింగ్: 2.5/5

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.