March 17, 202508:29:37 AM

Bachhala Malli Review in Telugu: బచ్చల మల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Bachhala Malli Movie Review & Rating (1)

అల్లరి నరేష్ (Allari Naresh) మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చాలా ఏళ్లవుతోంది. తన ఎదుగుదలకి కారణమైన కామెడీ సినిమాలు సరిగా ఆడక, అవి కాదని చేసిన ప్రయోగాలు సరైన రిజల్ట్ ఇవ్వక ఒక మీమాంసలో ఉండిపోయాడు అల్లరి నరేష్. అయితే.. “నాంది”తో కాస్త గట్టున పడ్డాడు. తర్వాత మళ్లీ వరుస దెబ్బలు పడ్డాయి. ఈసారి “బచ్చల మల్లి”తో (Bachhala Malli) తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నరేష్. “సోలో బ్రతుకే సో బెటర్”  (Solo Brathuke So Better) ఫేమ్ సుబ్బు (Subbu Mangadevi)  ఈ చిత్రానికి దర్శకుడు. మరి ఈ సినిమాతో నరేష్ & సుబ్బులు అడియన్స్ ను ఈమేరకు ఆకట్టుకున్నారో చూద్దాం..!!

Bachhala Malli Review in Telugu

Bachhala Malli Movie Review & Rating (1)

కథ: జనవరి 18, 1985లో జరిగిన ఓ సంఘటన టెన్త్ లో జిల్లా ఫస్ట్ సాధించిన బచ్చల మల్లి (అల్లరి నరేష్) జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ సంఘటన అతడ్ని చదువు నుండి దూరం చేస్తుంది, కన్నతల్లి వేదనను పట్టించుకోని పోరంబోకులా మారుస్తుంది. అంతలా మల్లిగాడిని గాయపరిచిన సంఘటన ఏమిటి? మల్లి మళ్లీ మారడానికి అతడిలో చిగురించిన ప్రేమ ఎంతవరకు ఉపయోగపడింది? మల్లి మూర్ఖత్వాన్ని తట్టుకొని ఆ ప్రేమ నిలబడిందా? 2005లో మల్లిగాడి జీవితం ఏ తీరానికి చేరుకుంది? వంటి ప్రశ్నలకు సమాధానమే “బచ్చల మల్లి” చిత్రం.

Bachhala Malli Movie Review & Rating (1)

నటీనటుల పనితీరు: ఒక పాత్రను పూర్తిగా నమ్మి, ఆ పాత్రకు ప్రాణం పోయగల నటుల్లో అల్లరి నరేష్ ఒకడు. “నేను” మొదలుకొని మొన్నామధ్య వచ్చిన “నాంది” వరకు ప్రతి సినిమాలోని పాత్రలో ఇమిడిపోయాడు. “బచ్చల మల్లి” పాత్రలోనూ అదేస్థాయిలో ఒదిగిపోయాడు. సినిమా మొదలైన రెండు నిమిషాలకే ప్రేక్షకులు అల్లరి నరేష్ ను కాక.. బచ్చల మల్లిని చూడడం మొదలెడతారు. ఆ పాత్ర తాలూకు మూర్ఖత్వపు చేష్టలను తిట్టుకుంటారు, ఆ పాత్ర చుట్టూ తిరిగే పాత్రలతో ప్రయాణం చేస్తూ.. వీడు ఇప్పుడు మారినా బాగుండు అని ఆశపడుతుంటారు. అంతలా పాత్రలో లీనమైపోయాడు నరేష్. అతడి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కాదు కానీ.. ఒక నటుడిగా పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి ఎంత కష్టపడతాడు అనేందుకు ఈ చిత్రం ఉదాహరణగా నిలుస్తుంది.

అమృత అయ్యర్ (Amritha Aiyer)  ముఖంలో అమాయకత్వం కనిపించినంత స్పష్టంగా మిగతా భావోద్వేగాలు కనిపించలేదు. ముఖ్యంగా బాధ అనేది ఆమె ముఖంలో అస్సలు తెలియలేదు. నటిగా ఈ తరహా ఉచ్ఛస్థాయి హావభావాలు పండించేలా ఆమె ఇంకా పరిపక్వత చెందాల్సిన అవసరం ఉంది. అయితే.. ఆమె పాత్రకు కొందరు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరి తర్వాత తనదైన నటనతో ఆకట్టుకున్న నటి హరితేజ. మొదట్లో కామెడీ చేసినా, అనంతరం ఎమోషనల్ గాను ఆకట్టుకుంది. చాలారోజుల తర్వాత ప్రవీణ్ కు మంచి పాత్ర లభించింది. డిఫరెంట్ వాయిస్ యాక్టింగ్ తో కాస్త పెద్దరికం ఉన్న పాత్రలో కామెడీతోపాటు ఎమోషన్ ను కూడా చక్కగా పండించాడు.

ఎప్పట్లానే రోషన్ మరోసారి జూనియర్ హీరోగా ఇరగదీశాడు. ఈ అబ్బాయికి మాత్రం మంచి భవిష్యత్ ఉంది. ఇంత చిన్న వయసులో ఆస్థాయి ఎమోషన్స్ ను పండించడం అనేది మామూలు విషయం కాదు. తండ్రి పాత్రలో కోట జయరాం, రావు రమేష్ లు తమ సీనియారిటీని ప్రూవ్ చేసుకున్నారు. హర్ష చెముడు కాస్త హాస్యాన్ని పంచడంతోపాటు కథలో కీలకపాత్రగా నిలిచాడు. ఇక అంకిత్ కొయ్య, అచ్యుత్ కుమార్, రోహిణి వంటివారు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

Bachhala Malli Movie Review & Rating (1)

సాంకేతికవర్గం పనితీరు: విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటలు అర్థవంతంగా ఉండగా.. నేపథ్య సంగీతం మాత్రం సరిగా వర్కవుట్ అవ్వలేదు. పాటల్లోని సాహిత్యం మాత్రం సినిమాలోని భావాన్ని చక్కగా ఎలివేట్ చేసింది. రిచర్డ్ ఎం.నాథన్ సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం చాలా బాగుంది. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ లో నరేష్ ఎలివేషన్ షాట్ ను ఎగ్జిక్యూట్ చేసిన విధానం సినిమాలో బెస్ట్ షాట్ అని చెప్పొచ్చు. అలాగే.. కలర్ గ్రేడింగ్ తో ఆడియన్స్ కు ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇద్దామనుకున్న ప్రయత్నం అభినందనీయం. ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్, సీజీ వర్క్ విషయంలో చాలా చోట్ల దొరికిపోయినా, ఓవరాల్ గా పెద్దగా కంప్లైంట్స్ ఏమీ లేవు.

ఇక దర్శకుడు సుబ్బు మంగాదేవి విషయానికి వస్తే.. తాను ముందు నుంచి చెప్పుకొస్తున్నట్లే “మూర్ఖత్వం బోర్డర్ దాటిపోయిన ఓ మూర్ఖుడి కథ”గానే బచ్చల మల్లిని తెరకెక్కించాడు. అయితే.. ఆ బోర్డర్ దాటేసిన మూర్ఖత్వం ఓ అమ్మాయి కోసం ఎందుకు కంట్రోల్ లోకి వచ్చింది? అతడి మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న తల్లి విషయంలో ఎందుకని తగ్గలేదు అనే విషయానికి మాత్రం సరైన సమాధానం ఇవ్వలేదు. అందువల్ల మల్లిగాడి మూర్ఖత్వం కారణం లేని కోపంలా మిగిలిపోయింది. “ఎవడి కోసం మారాలి, ఎందుకు మారాలి” అంటూ మల్లిగాడి క్యారెక్టర్ ను ఎలివేట్ చేసిన తీరు బాగున్నా, ఎస్టాబ్లిష్మెంట్ లో సరైన బరువు లేకపోవడంతో ఆ పాత్ర తాలుకు బాధను ప్రేక్షకులు ఫీల్ అవ్వలేకపోయారు.

అయితే.. ఒక దర్శకుడిగా మాత్రం మంచి మార్కులు సంపాదించుకున్నాడు. సెన్సార్ ఇష్యూస్ కారణంగా మొదట్లో భగవద్గీత శ్లోకం ప్లేస్ లో పాత పాటను పెట్టకుండా ఉండి ఉంటే.. క్లైమాక్స్ లో వచ్చే శ్లోకానికి, ఆ సన్నివేశానికి మరింత వెయిటేజ్ వచ్చేది. అలా షాట్స్ కంపోజిషన్ & పేఆఫ్స్ విషయంలో జాగ్రత్తపడ్డాడు. అయితే.. రచయితగా మాత్రం తాను అనుకున్న పాయింట్ ను మరీ ఎక్కువగా ప్రేమించేశాడు. అందువల్ల సుబ్బులోని దర్శకుడిని, అతడిలోని రచయిత డామినేట్ చేశాడు.

Bachhala Malli Movie Review & Rating (1)

విశ్లేషణ: ఒక మనిషి తాను నమ్ముకున్న సిద్ధాంతాన్ని కోపంతోనే, బాధ్యతతోనో కట్టుబడి ఉండడం అనేది సహజం. అయితే.. ఎంతటి మూర్ఖుడికైనా మార్పు అనేది అవసరం, ఆ మార్పు వచ్చినట్లే వచ్చి మళ్లీ మొదటికి వచ్చిందంటే.. ఆ మూర్ఖుడిలో వచ్చిన మార్పుకి అర్థం లేనట్లే. “బచ్చల మల్లి” బాధపడేది కూడా ఈ తరహా క్యారెక్టరైజేషన్ వల్లే. మనం ఈ తరహా కథలు ఇప్పటికే చాలా చూసాం, అయితే.. దర్శకుడు కాస్త దృఢంగా నా హీరో మూర్ఖత్వాన్ని వదలడు, అందువల్ల ఏం కోల్పోయాడో చూడండి అని ప్రేక్షకుల్ని కాస్త ఇబ్బందిపెట్టాడు.

Bachhala Malli Movie Review & Rating (1)

ఫోకస్ పాయింట్: బాక్సులో కూరుకుపోయిన మూర్ఖత్వం!

రేటింగ్: 2/5

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.