సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన అనంతరం అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టయి చంచల్ గూడ జైలుకు తరలించడం ఇండస్ట్రీలో అందరిని షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. 14 రోజుల రిమాండ్ విధించగా, హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ, కొన్ని కారణాల వల్ల బన్నీ శుక్రవారం రాత్రి జైలులోనే గడపాల్సి వచ్చింది. శనివారం ఉదయం విడుదలైన తర్వాత, తన నివాసానికి చేరుకునే ముందుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కు వెళ్లి న్యాయవాదులతో చర్చించారు.
Jr NTR, Allu Arjun
అల్లు అర్జున్ ఇంటికి టాలీవుడ్ ప్రముఖులు పెద్ద ఎత్తున విచ్చేసి ఆయనను పరామర్శించారు. దర్శకులు రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరటాల శివతో పాటు నిర్మాతలు నవీన్, దిల్ రాజు, హీరోలు రానా, నాగచైతన్య, విజయ్ దేవరకొండ, సుధీర్ బాబు తదితరులు బన్నీతో సమావేశమై సంఘటనపై మాట్లాడారు. మరోవైపు, హీరో ప్రభాస్ ఫోన్ ద్వారా బన్నీతో మాట్లాడి సానుభూతి వ్యక్తం చేశారని తెలుస్తోంది. అయితే, ఇలాంటి సమయంలో తారక్ కనిపించకపోవడం అభిమానుల్లో, నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) , అల్లు అర్జున్ మధ్య ఉన్న సన్నిహిత బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరూ ఒకరినొకరు భావ అంటూ ప్రేమతో పిలుచుకుంటూ అభిమానుల ముందు తమ అనుబంధాన్ని వెల్లడించేవారు. కానీ ప్రస్తుతం తారక్ హైదరాబాద్ కు రాలేకపోయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే తారక్ ప్రస్తుతం తన బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. హృతిక్ రోషన్‌తో (Hrithik Roshan) కలిసి కీలక సన్నివేశాలను ముంబయిలో చిత్రీకరిస్తున్నారు.
సమయం లేకపోవడంతోనే అల్లు అర్జున్‌ను వ్యక్తిగతంగా కలవలేకపోయినట్లు సమాచారం. అయితే తారక్, బన్నీకి ఫోన్ చేసి తన పరామర్శను తెలిపి, వివిధ అంశాలపై మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తారక్ రాకపోవడం వెనుక పలు చర్చలు మొదలైనా, ఆయన బిజీ షెడ్యూల్ కారణంగానే ఇది జరిగినట్లు క్లారిటీ వచ్చింది. ఇక హైదరాబాద్ కు రాగానే ఎన్టీఆర్ బన్నీని కలిసే అవకాశం ఉంది.