హోమ్లీ పాత్రలకు ఒకప్పుడు ఫేవరెట్, ఆ తర్వాత తల్లి, వదిన పాత్రలకు సూటబుల్ నటిగా పేరు తెచ్చుకున్న దేవయాని.. ఇప్పుడు తనలోని మరో కళను బయటకు తీశారు. అంతేకాదు దాంతో అవార్డు కూడా సంపాదించారు. దేవయానికి ఇటీవల దర్శకురాలిగా మారిన విషయం తెలిసిందే. అలా తీసిన సినిమాకు ఉత్తమ దర్శకురాలు పురస్కారం కూడా అందుకున్నారు. దానికి సంబంధిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారయి. ‘సుస్వాగతం’ (Suswagatham) సినిమాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎంత ఫేమసో, దేవయానికి (Devayani) కూడా అంతే ఫేమస్ అని అంటే అతిశయోక్తి కాదు.
Devayani
దానికి కారణం కూడా పవనే. ఆమె గురించి అంత గొప్పగా మాట్లాడతాడు. ఆ సినిమా తర్వాత ఆమె రెండు సినిమాలు చేసినా ఆశించిన పేరు రాలేదు. దీంతో మనకు దూరమై తమిళంలో వరుస సినిమాలు చేసి స్టార్‌గా వెలుగొందింది. ఆ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకొని ‘చెన్నకేశవరెడ్డి’ (Chennakesava Reddy) సినిమాలో చెల్లి పాత్రతో వచ్చింది. అప్పటి నుండి తెలుగులో అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తోంది.
ఆ దేవయాని ఇప్పుడు దర్శకురాలిగా మారారు. ‘కైక్కుట్టై రాణి’ అనే షార్ట్ ఫిల్మ్‌ను ఇటీవల ఆమె తెరకెక్కించారు. 20 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్‌కు జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు వచ్చింది. అలా తొలి షార్ట్ ఫిల్మ్‌తోనే అవార్డు అందుకున్నారు. పిల్లల భావాలకు సంబందించిన కథతో తెరకెక్కిన ‘కైకుట్టై రాణి’ లఘు చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja) సంగీతం అందించడం విశేషం.
అనుకోని పరిస్థితుల్లో తల్లిని పోగొట్టుకుని, ఉద్యోగ రీత్యా తండ్రి దూర ప్రాంతంలో ఉన్న ఓ చిన్నారి జీవితంలో జరిగిన ఘటనల సమాహారమే ఈ సినిమా. ఇన్ని సినిమాల్లో నటించిన తనకు దర్శకురాలిగా ఈ అవార్డు అందుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తోందని అవార్డు అందుకున్నాక దేవయాని చెప్పారు. అలాగే ఈ సినిమా విదేశీ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించే ఆలోచన చేస్తున్నామని చెప్పారామె.