తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో విడుదలైన ‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి ఆరంభంలో భారీ అంచనాలు ఉన్నప్పటికీ, హిందీ వెర్షన్ కలెక్షన్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. మొదటి వారాంతంలో ఈ చిత్రం నార్త్ లో మంచి వసూళ్లను సాధించింది, మొదటి మూడు రోజుల్లోనే దాదాపు రూ. 27 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. దీంతో చిత్రం వసూళ్ల పరంగా మంచి ప్రారంభమని భావింపజేసినా, సోమవారం నుంచి అసలు ట్విస్ట్ ఇచ్చింది.
Game Changer
వీకెండ్ అనంతరం డ్రాప్ స్పష్టంగా కనిపించింది. మకర సంక్రాంతి సెలవు రోజుల్లో కూడా హిందీ వెర్షన్ కలెక్షన్లలో పెరుగుదల కనిపించకపోవడం ట్రేడ్ విశ్లేషకులను ఆందోళనకు గురి చేసింది. నాల్గవ రోజు కలెక్షన్లు కేవలం రూ. 2.42 కోట్లకు పరిమితమవగా, మంగళవారం కూడా ఇదే స్థాయిలో కొనసాగడం సడన్ షాక్ ఇచ్చింది. సంక్రాంతి పండుగ కారణంగా ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, భారీగా పడిపోవడం డిస్ట్రిబ్యూటర్లను నిరాశ పరిచింది.
తొలిరోజు హిందీ మార్కెట్‌లో ఈ చిత్రం ఊహించిన దానికంటే మెరుగైన స్పందనను పొందినా, ఆ తర్వాతి రోజుల్లో అదే జోరును కొనసాగించలేకపోయింది. ట్రేడ్ వర్గాల ప్రకారం, రిపీట్ ఆడియన్స్ లేకపోవడం, నెగెటివ్ రివ్యూలు ప్రభావం చూపించాయనే టాక్ ఉంది. పైగా, సినిమా విడుదలైన మొదటి రోజే హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం వసూళ్లను తగ్గించిందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
450 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందించిన ఈ పాన్ ఇండియా సినిమా సంక్రాంతి రేసులో తనదైన గుర్తింపు తెచ్చుకోవాలని భావించినా, నెగెటివ్ రివ్యూల కారణంగా భారీ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో సినిమా ట్రెండ్ పూర్తిగా మారిందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. తొలివారాంతం తర్వాత, ‘గేమ్ ఛేంజర్’ హిందీ వెర్షన్ నిలకడగా కొనసాగితే, సినిమా లాంగ్ రన్ వసూళ్లను కొంతమేర పెంచుకునే ఛాన్స్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తోంది.