టాలీవుడ్‌లో తాజాగా ఆదాయపన్ను శాఖ (ఐటీ) దాడులు (Income Tax Raids) హాట్ టాపిక్ గా మారాయి. ఈ దాడులు ప్రధానంగా పాన్ ఇండియా సినిమాల ఆర్థిక లావాదేవీలపై నిలిచాయి. “పుష్ప 2: ది రూల్” (Pushpa 2) ప్రీ రిలీజ్ వేడుకలో సినిమా విడుదలకు ముందే వెయ్యి కోట్ల బిజినెస్ చేశామని యాంకర్ ప్రకటించిన మాటలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీశాయి. వేదిక మీద చెప్పిన ఈ ప్రకటనలు ఐటీ అధికారుల దృష్టిని ఆకర్షించాయనే టాక్ వినిపిస్తోంది.
Income Tax Raids
ఇటీవల పెద్ద సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కలెక్షన్ల గురించి చెప్పడం, వందల కోట్లు వసూలు చేసిందని పోస్టర్ల ద్వారా ప్రచారం చేయడం కామన్ అయిపోయింది. కానీ ఈ హడావిడే ఇప్పుడు కొందరు నిర్మాతలపై ఐటీ దాడులకు కారణమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజు (Dil Raju) సంస్థలు.. వారితో లింక్స్ ఉన్న మ్యాంగో మీడియా వంటి ప్రముఖ సంస్థల మీద ఈ దాడులు జరగడం పరిశ్రమలో కలకలం రేపుతోంది.
వందల మంది ఐటీ అధికారులు నాలుగు రోజుల పాటు ఈ దాడులను కొనసాగించనున్నట్లు సమాచారం. “పుష్ప 2” వంటి భారీ బడ్జెట్ చిత్రాల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత లేకపోవడం, కలెక్షన్లపై పన్ను చెల్లింపుల విషయంలో అనుమానాలు తలెత్తడం ఈ దాడులకు కారణమని చెప్పుకుంటున్నారు. సంక్రాంతి సీజన్‌లో విడుదలైన పెద్ద సినిమాలు ఇతర పాన్ ఇండియా చిత్రాలకు సంబంధించిన లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. పబ్లిసిటీ కోసం కలెక్షన్లను అతిశయోక్తిగా చూపించడం ఇప్పుడు నిర్మాతల పీడగా మారింది.
నిర్మాతలు ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు, పోస్టర్లలో చూపిన డేటా, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో చేసిన ప్రకటనలు అన్నీ ఇప్పుడు ఐటీ శాఖ ముందుకు రావడానికి కారణమవుతున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇలాంటి దాడులు పరిశ్రమపై కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాల ఆర్థిక వ్యవహారాలు మరింత పారదర్శకంగా ఉండాలనే పిలుపు వినిపిస్తోంది. ఇది టాలీవుడ్ నిర్మాతలకు గుణపాఠంగా మారి, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను నివారించడానికి మార్గం చూపుతుందేమో చూడాలి.