కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈతూరి నవ్వించేకి వస్తుండా అంటూ కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు వరుణ్‌తేజ్ (Varun Tej). ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటనను విడుదల చేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్‌మెంట్ నిర్మిస్తున్నాయి. వరుణ్ తేజ్‌కి ఇది 15వ సినిమా కావడం గమనార్హం. నిజానికి ఈ సినిమా గురించి చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.
Varun Tej
రాయలసీమ నేపథ్యంలో సాగనున్నట్టు ఈ సినిమాలో వరుణ్‌తేజ్ ‘కొరియన్ కనకరాజు’ అనే పాత్రలో కనిపిస్తాడని సమాచారం. అంతేకాదు సినిమా పేరు కూడా అదే అని అంటున్నారు. రాయలసీమ యాసలోనే ఈ సినిమాను ‘ఎక్స్’లో ప్రకటించాడు వరుణ్‌తేజ్. ఇండో – కొరియన్ హారర్ కామెడీ సినిమా ఇది. థ్రిల్, హాస్యం మేళవింపుతో మేర్లపాక గాంధీ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. మార్చిలో ఈ సినిమా పనులు మొదలవుతాయట. కొరియన్ సినిమాలు, కొరియన్ కుర్రాళ్లు, కొరియన్ ఫుడ్..
వీటికి మన దగ్గర ఆసక్తి ఎక్కువ. కొరియన్ కుర్రాళ్లు బీటీఎస్ బ్యాచ్ అని మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) ఈ సినిమాలో బీటీఎస్ రిఫరెన్స్‌ను తీసుకుంటారో లేదో చూడలి. ఇక వరుణ్ తేజ్ ‘మట్కా’ (Matka) సినిమాతో గతేడాది వచ్చినా.. ప్రేక్షకులు ఆదరించలేదు. కరుణ కుమార్ (Karuna Kumar) డైరెక్ట్ చేసిన ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర ఫెయిలైంది. దీంతో వరుణ్ చాలా ఆలోచించి ఈ కథను ముందుకు తీసుకొస్తున్నాడు అని అర్థమవుతోంది.
ప్రేమకథలతో తిరిగి ట్రాక్ ఎక్కినట్లు కనిపించిన వరుణ్.. కమర్షియల్ సినిమాల వైపు వెళ్లి వరుస పరాజయాలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు కామెడీ లైన్‌లోకి వచ్చి ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడని అర్థమవుతోంది. ఇక ఈ సినిమా నిర్మాణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ భాగస్వామి అయింది. అనుష్క (Anushka Shetty) ‘ఘాటి’ (Ghaati) సినిమాలో కూడా వారు భాగస్వాములు. క్రిష్ చేసే సినిమాలకు ఎక్కువగా నిర్మాణ భాగస్వామిగా ఈ బ్యానర్ ఉండేది.