సినిమాల వసూళ్ల పోస్టర్లకు సంబంధించి కొన్ని రోజుల క్రితం మన ఫిల్మీ ఫోకస్‌లో ఓ స్పెషల్ స్టోరీ చదివే ఉంటారు. అసలు పోస్టర్లు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, అందులో చూపిస్తున్న నెంబర్లు కరెక్టేనా? ఆ పోస్టర్ల వల్ల అభిమానుల మధ్య వస్తున్న ఇబ్బందులు ఏంటి? దీని వల్ల పరిశ్రమకు ఏమన్నా ఇబ్బంది ఉందా? తప్పుడు నెంబర్లు ఇచ్చి అభిమానుల ముందు చులకన అవుతున్నారా? అని చర్చ జరిగింది అందులో. ఇప్పుడు ఇంచుమించు అలాంటి వ్యాఖ్యలే వినిపించాయి ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ నుండి.
Producer
ఈ సంక్రాంతికి వచ్చి భారీ స్థాయి విజయం అందుకున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam) . ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని నిర్మాతలు (Producer) ఇటీవల ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్ జేబులు బాగా నిండాయి అనే ఆనందంలో తొలిసారి డిస్ట్రిబ్యూటర్ గ్రాటిట్యూడ్ ఈవెంట్ నిర్వహించింది ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీమ్. ఈ క్రమంలో వెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఎల్వీఆర్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు.
గత రెండేళ్లలో ఎన్నో పెద్ద సినిమాలు వచ్చాయని, ఎన్నో వందల రూ.కోట్లు వచ్చాయని పోస్టర్లు వేశారని, సక్సెస్ పార్టీ అంటూ కొంత మందిని విదేశాలకు కూడా తీసుకెళ్లారు అని, కానీ గ్రౌండ్ రియాల్టీ వేరేలా ఉంది అని ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావించగా.. ఎల్వీఆర్ స్పందిస్తూ మా డిస్ట్రిబ్యూటర్ల దౌర్భాగ్యం అలానే ఉంటుందని, అయితే మేం ఏదీ బయటకు మాట్లాడలేం అని అన్నారు. అంతేకాదు ఆ విషయంలో ఎవరూ మాట్లాడకూడదని, మాట్లాడితే విరోధం పెరుగుతుంది అని చెప్పారు.
డిస్ట్రిబ్యూటర్లు కొంతమంది డబ్బు పోగొట్టుకుని కూడా, పోగొట్టుకోలేదని చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. ఒకవేళ నష్టపోయామని చెబితే తర్వాత వచ్చే సినిమా ఇవ్వరని అన్నారు ఎల్వీఆర్. అంతేకాదు ఇప్పుడు కలెక్షన్ల పోస్టర్లను చూసి జనాలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎల్వీఆర్ ఏ సినిమాల గురించి, ఏ నిర్మాతల గురించి అన్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకరిద్దరు నిర్మాతల (Producer) గురించా, మొత్తం సినిమా పరిశ్రమ గురించా అనేది ఆయనే చెప్పాలి.