![Thandel Movie Review and Rating](https://blr1.digitaloceanspaces.com/assets.telugu/wp-content/uploads/2025/02/Thandel-Movie-Review-and-Rating.jpg)
చేపల వేట కోసం వెళ్లి పాకిస్థాన్ లో చిక్కుకున్న కొందరు మత్సకారుల జీవితాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం “తండేల్” (Thandel). నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా చందు మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో బన్నీ వాసు నిర్మించారు. చాన్నాళ్ల తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థ నుండి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
Thandel Review
కథ: రాజు (నాగచైతన్య) తన తండ్రి నుండి పుణికిపుచ్చుకున్న చేపల వేట మరియు నాయకత్వ లక్షణాలతో శ్రీకాకుళం నుండి చేపలు పట్టడానికి గుజరాత్ వెళ్లే గుంపుకు తండేల్ గా వ్యవహరిస్తాడు. 9 నెలలు సముద్రంలో చేపలు పడుతూ గడిపేసి.. మూడు నెలలు మాత్రం తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే బుజ్జితల్లి/సత్య (సాయిపల్లవి)తో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు.
ఒకసారి చేపల వేటకు వెళ్లినప్పుడు.. అనుకోని విధంగా పాకిస్థాన్ సరిహద్దులోకి ప్రవేశించి, అక్కడి ఆర్మీ చేత అరెస్ట్ చేయబడతారు 22 మంది మత్స్యకారులు. పాకిస్థాన్ జైల్ నుంచి 22 మంది మత్స్యకారులను ఇండియాకి తీసుకొచ్చేందుకు సత్య ఎలా పోరాడింది? ఈ క్రమంలో భారతీయ ప్రభుత్వం ఎలా సహాయపడింది? అనేది “తండేల్”(Thandel) కథాంశం.
నటీనటుల పనితీరు: నాగచైతన్య పాత్ర కోసం ప్రాణం పెట్టి నటించాడు. భాష, యాస, బాడీ లాంగ్వేజ్ వంటి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తపడ్డాడు. చాలా సాధారణ సన్నివేశాల్లో కూడా మంచి ఎమోషన్ పండించాడు చైతన్య. నటుడిగా అతడ్ని మరో మెట్టు ఎక్కించే సినిమా ఇది.
సాయిపల్లవి నటిగా విశేషంగా ఆకట్టుకుంది. అయితే.. ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడంతో శ్రీకాకుళం యాసలో సహజత్వం లోపించింది. అందువల్ల డైలాగ్స్ లో ఫీల్ మిస్ అయ్యింది. అయితే.. మొండి ప్రేమికురాలిగా ఆమె హావభావాలు ప్రేక్షకులని అలరించాయి.
దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్, కల్పలత తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే.. తమిళ నటుడు కరుణాకరన్ సినిమాలో ఇమడడానికి కాస్త ఇబ్బందిపడ్డాడు. తమిళ వెర్షన్ కోసం అతడ్ని తీసుకొన్నప్పటికీ.. ఆ పాత్రలో ఎవరైనా మంచి తెలుగు ఆర్టిస్ట్ ఉండి ఉంటే ఇంకాస్త బాగా పండేది.
సాంకేతికవర్గం పనితీరు: దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) పాటలు ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. “హైలెస్సా, బుజ్జి తల్లి” పాటలు ఎంత వినసొంపుగా ఉన్నాయో, తెరపై అంతే అందంగా ఉన్నాయి. పాటల చిత్రీకరణ విషయంలో మాంటేజస్ కి ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల.. మంచి ఫీల్ ఇచ్చాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది.
శామ్ దత్ సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. సముద్రంలో తుఫాన్ ఎపిసోడ్ ను కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన విధానం బాగుంది. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడకపోవడం వల్ల క్వాలిటీ పరంగా సినిమా మెప్పించింది. మరీ ముఖ్యంగా నాగేంద్ర కుమార్ ప్రొడక్షన్ డిజైన్ సినిమాకి సహజత్వాన్ని తీసుకొచ్చింది. ఇళ్లు కానీ పడవలు కానీ, జైల్ అన్నీ చాలా నేచురల్ గా ఉన్నాయి.
దర్శకుడు చందు మొండేటి సినిమాలో రెండు పడవల ప్రయాణం చేశాడు. ప్రేమకథలో, దేశభక్తిని జొప్పించే ప్రయత్నంలో ఎమోషన్ లోపించింది. ముఖ్యంగా పాకిస్థాన్ జైల్ ఎపిసోడ్ చాలా పేలవంగా సాగింది. అలాగే.. లీడ్ పెయిర్ లవ్ స్టోరీని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉండొచ్చు. 151 నిమిషాల నిడివి కూడా మైనస్ గా మారింది.
అయితే.. నాగచైతన్యలోని నటుడ్ని వినియోగించుకోవడంలో, తండేల్ ప్రపంచాన్ని నిర్మించడంలో విజయం సాధించాడు. కథకుడిగా కంటే దర్శకుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు. కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమా సూపర్ హిట్ అయ్యేది.
విశ్లేషణ: కొన్ని కథలు పాయింట్ గా అనుకున్నప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆ పాయింట్ ను సరైన కథనంతో ప్రెజెంట్ చేసినప్పుడే సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఈ కీలకమైన కథనం విషయంలోనే “తండేల్” తడబడింది. ఆ కారణంగా నేచురల్ సెట్స్, మంచి ప్రొడక్షన్ డిజైన్, అద్భుతమైన నట ప్రదర్శన ఉన్నప్పటికీ.. సినిమా పూర్తిస్థాయిలో అలరించలేకపోయింది. అయితే.. నటుడిగా నాగచైతన్య పడిన కష్టాన్ని, చందు మొండేటి కొన్ని సీన్స్ ను కంపోజ్ చేసిన విధానాన్ని, టెక్నికల్ టీమ్ పడిన శ్రమను మాత్రం మెచ్చుకోవాల్సిందే.
ఫోకస్ పాయింట్: తర్కం వీడినా.. తరింపజేయని తండేల్!
రేటింగ్: 2.5/5