
సినీ తారలు ఎక్కడ పని చేస్తున్నా తమ సొంత భాష, రాష్ట్రం మీద గౌరవం ఉండాలని చాలామంది భావిస్తారు. అదే ఇప్పుడు రష్మిక మందన్నా (Rashmika Mandanna) విషయంలో పెద్ద డిబేట్‌గా మారింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కర్ణాటక ప్రభుత్వం ఆమెను ఆహ్వానించినప్పటికీ రాలేదన్న కారణంగా ఆమెపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై మండి ఎమ్మెల్యే రవికుమార్ గౌడ సహా పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రష్మిక కర్ణాటక సినీ ఇండస్ట్రీని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.
Rashmika
ముఖ్యంగా రష్మిక ఇటీవల తన ఇంటిని హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆమెకు కన్నడతో సంబంధమే లేదన్నట్లుగా మాట్లాడటం అర్థం ఏంటని ఎమ్మెల్యే ప్రశ్నించారు. “కిరిక్ పార్టీ (Kirik Party) సినిమాతో కెరీర్ ప్రారంభించి కర్ణాటక నుంచే స్టార్ అయ్యింది. కానీ ఇప్పుడు కన్నడను పట్టించుకోవడం లేదు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హాజరుకావాల్సిందిగా మేము పలుమార్లు ప్రయత్నించినా రాలేనని చెప్పింది. ఇలా ఎలా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా స్పందించారు. సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వ మద్దతు కావాలంటే సినీ తారలు కూడా రాష్ట్రానికి గౌరవం ఇచ్చే విధంగా ప్రవర్తించాలని ఆయన అన్నారు. అంతేగాక, “ఇక్కడి ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్లక్ష్యం చేస్తే ప్రయోజనం ఏమిటి?” అని ప్రశ్నించారు. ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ కోసం చేస్తున్న కృషిని గుర్తించకుండా, నటీనటులు సహకరించకుండా పోతే భవిష్యత్తులో తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇక రష్మిక విషయంలో సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఆమె ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ కావడంతో పలు భాషల్లో సినిమాలు చేస్తోంది. దీంతో ఆమె తన టైమ్ మేనేజ్ చేయలేకపోయిందనే వాదన కూడా ఉంది. మరి ఈ వివాదంపై రష్మిక ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.