ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఓ రాజకీయ పెద్ద నాటకీయ మరణాన్ని కథాంశంగా తీసుకొని “మద” ఫేమ్ శ్రీవిద్య బసవ తెరకెక్కించిన చిత్రం “హత్య”. ట్రైలర్ విడుదలైనప్పటినుండి ఈ చిత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా.. ఇటీవల అధికారం కోల్పోయిన ఓ రాజకీయ పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా ఈ చిత్రం ఉందని వాదనలు వినిపించాయి. అయితే.. దర్శకురాలు శ్రీవిద్య మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పుకుంటూ వచ్చింది. మరి “హత్య”లో (Hatya) ఏం చూపించారు? ఆ నాటకీయ మరణానికి ఎలాంటి కంక్లూజన్ ఇచ్చారు? అనేది చూద్దాం..!!
Hatya Review
కథ: ఇల్లందుల అనే ప్రాంతంలో పేరుగాంచిన రాజకీయ నాయకుడు ధర్మేంద్ర రెడ్డి (రవివర్మ) నాటకీయ రీతిలో మరణిస్తాడు. తొలుత ఆయన మరణాన్ని గుండెపోటుగా చిత్రించే ప్రయత్నం జరిగినప్పటికీ.. వెంటనే అది హత్యగా మారుతుంది. అయితే.. అప్పటికే ఇంట్లో పనిచేసేవాళ్లంతా క్రైమ్ సీన్ ను నీట్ గా క్లీన్ చేయడంతో పోలీసులకు కనీస స్థాయి ఆధారాలు కూడా దొరక్కుండాపోతాయి. ఆ కేస్ ను ఇన్వెస్టిగేట్ చేయడానికి సిట్ ను రంగంలోకి దించుతారు.
ఆ టీమ్ ని లీడ్ చేసే సుధ (ధన్య బాలకృష్ణ) స్వయంగా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాక రకరకాల వెర్షన్లు బయటకి వస్తాయి. అసలు ధర్మేందర్ రెడ్డిని హత్య చేసింది ఎవరు? అందుకు కారణం ఏమిటి? ఈ కేసులో సలీమా (పూజ రామచంద్రన్) ఎలా కీలకమైన ఆధారంగా మారింది? వంటి ప్రశ్నలకు సమాధానమే “హత్య” (Hatya) చిత్రం.
నటీనటుల పనితీరు: సాధారణంగా సినిమాల్లో లేడీ పోలీసులు అనగానే.. కాస్త మగాడిలా చూపించే ప్రయత్నం జరిగిపోతుంటుంది. కానీ.. ఈ సినిమాలో ధన్య బాలకృష్ణ పోషించిన పోలీస్ పాత్ర చాలా సహజంగా కనిపించింది. ఆ పాత్రలో ధన్య నటన కూడా బాగుంది. మరో కీలకపాత్రలో పూజా రామచంద్రన్ తన నటనతో కథా గమనానికి ఉపయోగపడింది.
ఈ ఇద్దరి తర్వాత ఆకట్టుకున్న నటుడు రవివర్మ. ఓ రాజకీయ నాయకుడిగా, వయసుడికిన పెద్ద వ్యక్తిగా రవివర్మ పాత్రలో ఒదిగిపోయాడు. ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు.. అతడు మిమిక్ చేయడానికి ప్రయత్నించలేదు, అందువల్ల ఆ పాత్ర మరింత చక్కగా పండింది. కిరణ్ రెడ్డిగా భరత్, అనితగా బిందు చంద్రమౌళి తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకురాలు శ్రీవిద్య బసవ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో “ఈ సినిమాకి మేమేమీ కంక్లూజన్ ఇవ్వడం లేదు” అని చెప్పి.. ఈ హత్యా ఉదంతం ఇలా జరిగి ఉండొచ్చు అంటూ సినిమా ముగించిన విధానానికి పొంతన లేకుండాపోయింది. ముఖ్యంగా.. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమాని చూసినప్పుడు ఓ వైపుకి కొమ్ము కాసిన భావన కలగడం ఖాయం. ఒక రియలిస్టిక్ ఇన్సిడెంట్ పై సినిమా తీస్తున్నప్పుడు “ఇది ఇలా జరిగి ఉండవచ్చు” అని ఒక స్టాండ్ తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే.. ఇలాగే జరిగింది అని కోర్టులో ఉన్న కేస్ విషయంలో స్టేట్మెంట్ పాస్ చేయడం అనేది మాత్రం సినిమాకి మైనస్ గా మారింది. ఒక దర్శకురాలిగా టెక్నికల్ గా ఎంత జాగ్రత్త తీసుకున్నా.. ఇలాంటి సంఘటనల విషయంలో ఒకరి స్టాండ్ తీసుకొని.. సదరు సంఘటనను వైట్ వాష్ చేయడానికి ప్రయత్నించడం అనేది సమర్థించదగిన విషయం కాదు.
నరేష్ కుమారన్ సంగీతం, అభిరాజ్ నాయర్ సినిమాటోగ్రఫీ వర్క్, కలర్ గ్రేడింగ్, ఆర్ట్ వర్క్ వంటివన్నీ బడ్జెట్ కు తగ్గ స్థాయిలో కుదిరాయి. అనిల్ కుమార్ ఎడిటింగ్ కూడా బాగుంది. టెక్నికల్ గా ఈ సినిమాను వేలెత్తి చూపాల్సిన పని లేకుండా జాగ్రత్తపడ్డారు నిర్మాణ బృందం.
విశ్లేషణ: ప్రస్తుత అధికార ప్రభుత్వం రూలింగ్ లో లేనప్పుడు వారిని కించపరచడానికి కోకొల్లలుగా సినిమాలొచ్చిన విషయం తెలిసిందే. కొన్ని సినిమాలు గత ప్రభుత్వానికి వంతపాడాయి, ఇంకొన్ని సినిమాలు తప్పుబట్టాయి. అయితే.. అటు సపోర్ట్ చేయకుండా, ఇటు అటాక్ చేయకుండా.. వాళ్ల ఇమేజ్ ను డ్యామేజ్ చేయకుండా, ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తూ రూపొందిన సినిమాగా “హత్య” నిలుస్తుంది. ఎంత వద్దనుకున్నా.. ఈ చిత్రంలో రాజకీయ కోణం అనేది స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. అందువల్ల.. సమకాలీన రాజకీయ విషయాలపై అవగాహన ఉన్నవాళ్ళకి ఈ సినిమా కథనంలో దొర్లిన తప్పులు కనిపిస్తాయి. అయితే.. రాజకీయ కోణంలో కాక ఒక డాక్యుమెంటరీ డ్రామాగా ఈ సినిమా చూడగలిగితే మాత్రం టెక్నికల్ గా ఆకట్టుకునే చిత్రమిది.
ఫోకస్ పాయింట్: రాజకీయ అంతర్యుద్ధానికి వైట్ వాష్ చేసే ప్రయత్నం ఈ “హత్య”
రేటింగ్: 2.5/5