
మలయాళ సినిమాలు ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నాయి. వరుసగా రూ. వంద కోట్లు మార్కును టచ్ చేస్తున్నాయి. ఒక మంచి సినిమా వచ్చింది అని తెలియగానే మనవాళ్లు కూడా మలయాళంలోనే చూసేస్తున్నారు. థియేటర్‌లో కాకపోయినా ఓటీటీలో అయినా చూసేస్తున్నారు. అలా ఓటీటీలో తెగ చూసేసిన ఓ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ‘జయ జయ జయ జయ హే’ సినిమానే ఇప్పుడు రీమేక్ చేస్తున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘జయ జయ జయ జయ హే’ సినిమాలో దర్శన రాజేంద్రన్ (Darshana Rajendran) , బాసిల్ జోసెఫ్ (Basil Joseph) ప్రధాన పాత్రలు పోషించారు.
విపిన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమానే ఇప్పుడు తెలుగులో ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ ఇండియా రీమేక్ చేస్తున్నాయి. ఏఆర్ సజీవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు జోడీగా ఈషా రెబ్బా (Eesha Rebba) నటిస్తోంది. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ‘జయ జయ జయ జయ హే’ సినిమాను దర్శకుడు ఏఆర్ సజీవ మార్పులు చేసినట్లు చెబుతున్నారు. త్వరలో సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారట.
తరుణ్ భాస్కర్‌కి నటనపై ఆసక్తి ఎక్కువే. ఓవైపు సినిమాలు డైరెక్ట్ చేస్తూనే.. నటిస్తున్నారు కూడా. అలా ఇప్పుడు ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమహేంద్రవరంలో జరుగుతోంది. అక్టోబరులో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. సినిమా కథేంటంటే… జయభారతి (దర్శన రాజేంద్రన్) స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి. ఇంటర్ తర్వాత ఉన్నత చదువులు చదుకోవాలనుకుంటుంది.
ఎలాగోలా కుటుంబాన్ని ఒప్పించి డిగ్రీలో చేరుతుంది. అయితే, అక్కడ జరిగిన ఒక సంఘటన కారణంగా చదువు ఆపేసి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లయిన తర్వాత చదువును పూర్తి చేసి, ఉద్యోగం చేయాలన్నది ఆమె ఆశయం. అందుకు పెళ్లి చూపుల సమయంలో రాజేశ్ (బసిల్ జోసెఫ్) అంగీకరిస్తాడు. కానీ ఆ తర్వాత మాట మార్చేస్తాడు. చిన్న విషయానికే కోప్పడుతుంటాడు. కొన్నాళ్లు ఓపిక పట్టిన ఆమె… తర్వాత తిరగబడుతుంది. రాజేశ్‌ను జయ కొడుతున్న వీడియో వైరల్ అవుతుంది. ఆ తర్వాత ఏమైంది అనేదే కథ.