
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం – బీజేపీ- జనసేన కూటమి ప్రభుత్వం పాలనపరమైన సంస్కరణలతో ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు చేరుస్తోంది. పాలనకు సాంకేతికతను జోడించి అద్భుతమైన ఫలితాలు రాబట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలసీ. గతంలో ఈ- గవర్నెన్స్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్, రియల్‌టైమ్ గవర్నెన్స్ వంటి విధానాలతో ఆయన ప్రశంసలు దక్కించుకున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘‘మనమిత్ర’’ (Mana Mitra) పేరుతో వాట్సాప్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టింది.
Mana Mitra
ఈ ఏడాది జనవరి 30న ఆంధ్రప్రదేశ్ ఐటీ, రియల్ టైమ్ గవర్నెన్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రారంభించారు. పౌర సేవలు అందించడంతో పాటు వారి నుంచి వినతులు స్వీకరించడానికి ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. 95523 00009 వాట్సాప్ నెంబర్ కింద 161 పౌర సేవలను ప్రభుత్వం అందిస్తోంది. తద్వారా ధ్రువపత్రాల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని నారా లోకేష్ తెలిపారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు ఫిర్యాదులు, వినతులు ఇవ్వాలనుకునేవారు దానికి మెసేజ్ చేస్తే ఒక లింక్ వస్తుంది. అందులో ఫోన్, మొబైల్ నెంబర్, చిరునామా , తదితర వివరాలు అందిస్తే చాలు .ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో మన మిత్ర (Mana Mitra) వాట్సాప్ గవర్నెన్స్ సేవలను 200కు పెంచినట్లు మంత్రి నారా లోకేష్ గురువారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఏపీలో డిజిటల్ శక్తికి ఇది నిదర్శనమన్నారు. ప్రజల కోసం పౌర, కేంద్రీకృత సేవలను విస్తరిస్తూనే ఉంటామని లోకేష్ తెలిపారు.